Ramagundam | కోల్ సిటీ, డిసెంబర్ 11: ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట్ బిన్ లను కొనుగోలు చేసి నగరంలో జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. చిత్తు కాగితాలు, ఇతరత్రా వ్యర్థ పదార్థాలు రోడ్డ పై పడేయకుండా ఈ డస్ట్ బిన్ లను వినియోగించాలన్నదే బల్దియా ఉద్దేశం. కానీ అదే బల్దియా కార్యాలయంలోనే చెత్త డబ్బాలను ఈ విధంగా నిర్లక్ష్యం గా వదిలేస్తే ఇక బయట ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి అన్న సందేహం కలుగుతోంది.
నగర కార్యాలయంకు వచ్చే వినియోగదారులు, సిబ్బంది చెత్తను బయట పడేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లు ఇట్లుంటే.. మరి చెత్త వేసేదేట్ల అని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. పైగా, శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా అక్కడే ఉంటుంది. ఇలా నిర్లక్ష్యంగా కింద పడేసి ఉండటం, సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే అందులో ఉన్న చెత్తంతా గాలికి కార్యాలయం ఆవరణలోకి చిందరవందరగా కొట్టుకుపోతుంది. ఇది చూసినవారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.