జగిత్యాల, నవంబర్ 16 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థులతో కళాశాలలను బహిషరించి, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఫీజుల బకాయిలు రూ.7,850 కోట్లు, విద్యార్థుల సాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సాలర్షిప్లకు ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించ లేదన్నారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే ఇవ్వాలని, రాష్ట్రంలోని గురుకులాలను అభివృద్ధి చేయాలని, లేదంటే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. నిరసనలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొకు గంగాధర్, బీసీ యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా, బీసీ సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేశ్‌కుమార్, జగిత్యాల బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు బందెల మల్లయ్య, యూత్ కో ఆర్డినేటర్ హృషికేశ్, ముద్దం గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.