ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుండగా, అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నది. హాల్ టికెట్ లేని విద్యార్థులు నేరుగా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్షలు జరగనుండగా, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నది. సలహాలు, సూచనల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416ను ఏర్పాటు చేసింది.
– కమాన్‌చౌరస్తా, మార్చి 13
ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 67,816 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వీరి కోసం 123 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
-కమాన్‌చౌరస్తా, మార్చి 13
ఆర్టీసీ… నేను సైతం
ఇంటర్ పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ సైతం ఏర్పాట్లు చేయనుంది. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ చేయూతనందించనున్నది. రోడ్లపై ప్యాడ్ ఎత్తి చూపిస్తే బస్సు ఎక్కడైనా ఎక్కించుకునే విధంగా డ్రైవర్లకు ఆదేశాలు వెళ్లనున్నాయి.
వెబ్సైట్లో హాల్‌టికెట్లు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి ఎవరైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు వెబ్సైట్ http://tsbie.cgg.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినప్పటికీ పరీక్షలకు అనుమతిస్తారు.
అందుబాటులో వైద్య సిబ్బంది
పరీక్ష ప్రారంభం నుంచి చివరి వరకు కూడా వైద్య సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. విధులు నిర్వర్తించే ఏఎన్ఎం వద్ద మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
పరిసరాల పరిశుభ్రత
ప్రతి కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనున్నారు. విద్యార్థులు డ్యూయల్ డెస్క్‌లపై పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచనున్నారు. ఇందుకోసం స్థానిక తహసీల్దార్లు పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.
అమలులో నిమిషం నిబంధన
పరీక్షా కేంద్రాల వద్ద ఒక్క నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. దీని కోసం కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఆందోళన తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 31,455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 15,952 మంది, ద్వితీయ సంవత్సరం 15503 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పది ప్రభుత్వ, రెండు మోడల్ జూనియర్, ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ , రెండు మైనార్టీ రెసిడెన్షియల్, 36 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 51 మంది సీఎస్‌లు, 51 మంది డీవోలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. జిల్లాలో పరీక్షా కేంద్రాలు తెలియని వారు ఇంటర్మీడియట్ ఆప్ డౌన్లోడ్ చేసుకుంటే తాము ఉన్న ప్రదేశం నుంచి సరాసరి పరీక్ష కేంద్రానికి వెళ్లేలా లొకేషన్ ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి, సభ్యులుగా జగన్మోహన్రెడ్డి, ఆంజనేయరావు, శశిధరశర్మ, హెచ్పీసీ సభ్యుడుగా రవీందర్‌రెడ్డి ఉన్నారు.
ముఖ్యమైన సూచనలు
సైకాజిస్టుల సలహాలు