Narasimhaunipet | పెగడపల్లి: కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నరసింహునిపేట గ్రామం నేషనల్ అవార్డు కోసం నామినేట్ అయిన సందర్భంగా, పంచాయతీ పరిధిలో చేస్తున్న అభివృద్ధి పనులకు తమకు ఎలాంటి ఆహ్వానం రాలేదని ఆరోపించారు.
కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు జిల్లా, మండలం నుండి అధికారులు వచ్చి పాల్గొంటుంటే, తమకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇదేంటని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నిస్తే, సమయాభావం వల్ల సమాచారం ఇవ్వలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి కూడా తమను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఇటిక్యాల మధు, దొమ్మటి ప్రణయ్, నేరువట్ల సాగర్, తోడేటి రాజకుమారి ఉన్నారు.