రైతులకు కష్టకాలం ఎదురవుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగి సీజన్లో అరిగోస పడాల్సి వస్తున్నది. ఒకవైపు సాగునీటి తిప్పలు, విద్యుత్ కోతలు.. వడగండ్ల వానలతో సతమతమవుతున్న అన్నదాతకు, వరి ఈనే దశలో వస్తున్న తెగుళ్లతో పుండుమీద కారం చల్లిన చందంగా మారింది. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడి పెడితే దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. పంటలు చేతికోచ్చే సమయానికి మెడ విరుపు, మొగి పురుగు, అగ్గితెగులు మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో వరి గొలుసు ఊస (తాలు) పోతున్నది. కండ్ల ముందే పంట చేతికిరాకుండా పోతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కోనరావుపేట, ఏప్రిల్ 3 : రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. యాసంగిలో వరిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. పంట వేసిన మొదటి నుంచే రోగాలు వెంటాడుతున్నాయి. మందులను పిచికారీ చేసినా ఫలితం కనబడడం లేదు. నాట్లు వేసిన మొదటలో చలి ప్రభావితం చేయగా, తర్వాత నీరు సరిగా అందక పొలాలు పూర్తిగా ఎర్రబారాయి. ఎలాగోలా వాటిని రక్షించుకుంటే ఇప్పుడు చేతికొచ్చే దశలో గొలుసు తాలుబోతున్నది.
మొగి పురుగు, అగ్గి తెగులు, మెడ విరుపు వంటి లక్షణాలతో వరి దెబ్బతింటున్నది. వేలకు వేలు పెట్టి పలు రకాల మందులు కొనుక్కొచ్చి స్ప్రే చేసినా ఫలితం లేకపోవడం, రోజురోజుకూ తెగుళ్ల ఉధృతి పెరుగడం, వరి గొలుసు ఊస పోవడంతో రైతులకు దుఃఖమే మిగులుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తే కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ఇల్లంతకుంట మండలాలతోపాటు చాలా గ్రామాల్లో సాగునీరు సరిగా అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మిగిలిన కొంత పంట చేతికి వస్తదేమోనని ఆశిస్తే తెగుళ్లతో పంటలు పాడయ్యాయి. దీంతో ఎకరానికి 35 వేల వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఓవైపు ఆరుగాలం కష్టించి పండించిన పంట నీరందక ఎండిపోతుంటే.. ఇప్పుడు పంట చివరి దశలో మాయదారి రోగం పట్టుకున్నదని కంటతడి పెడుతున్నారు.
మొగి పురుగుతో తాలుపోతంది
నాకున్న నాలుగెకరాల్లో వరి వేసిన. అందులో అరెకరం దొడ్డు రకం, ప్రభుత్వం బోనస్ ఇస్తదన్న ఆశతో మూడున్నరెకరాల్లో సన్న రకాలు సాగు చేసిన. కానీ, అందులో అరెకరం ఎండిపోయింది. మిగతా వరి పొట్ట దశలో గొలక వేస్తే మొగి పురుగు సోకింది. దీంతో గొలుక తెల్లగా మారి తాలుపోతున్నది. సాగు చేసిన పొలానికి ఎకరాన 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి ఇస్తదనుకుంటే అవి కూడా రాలేవు. ఇక యాసంగి పంట పెట్టుబడి రాక అప్పుల పాలవడం తప్పేటట్టు లేదు.
– చింతలపల్లి తిరుపతిరెడ్డి, యువరైతు, మామిడిపల్లి (కోనరావుపేట మండలం)
పదెకరాలు ఊస పోయింది
ఈసారి వరి వేసినంక మొదటి నుంచే ఇబ్బందులు పడుతున్నం. నాకున్న 6 ఎకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని బోరు, బావి కింద వరి సాగు చేసిన. కానీ, నారుమడి నుంచి మందులు కొట్టినా పంటకు అగ్గి తెగులు వంటి రోగాలు వచ్చినయి. సుమారు ఎకరానికి 13 వేలు కౌలు ఇచ్చిన. వాటితోపాటు ఎకరాన 35 వేల వరకు పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు మొగి పురుగు వరి కాండాన్ని తొలుస్తంది. గొలుకకు తెల్లగా ఊస వచ్చింది. ఈసారి పెట్టుబడి పైసలు కూడా వచ్చేటట్టు లేదు.
– అల్లూరి తిరుపతిరెడ్డి, రైతు, మూడపల్లి (చందుర్తి మండలం)