సామాన్య రైతు రాజిరెడ్డిపై కేసు.. జైలుకు పంపిన వైనం
ఇటీవలే మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశం
సివిల్ కేసుల ఎఫెక్ట్‌తోనే ఎస్ఐ బదిలీ?
సర్వత్ర చర్చానీయాంశంగా మారిన ఠాణా
Thangallapally Police Station | సిరిసిల్ల రూరల్, జూన్ 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారు.. వారు ఏదీ చెపితే.. అదే చేస్తున్నారు. ‘ఇది మంచి పద్ధతి కాదు.. పోలీసులకి సివిల్ మ్యాటర్లో పనేంటి.? ‘అని ఘాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే అంకూసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య సందర్భంగా అన్న మాటలివి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ సంచనాలకు కేంద్ర బిందువుతుంది. తరుచు వివాదాలతో వివాదాల ఠాణగా నిలుస్తున్నది. గడిచిన 19 నెలల్లో సివిల్ కేసులతో హట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పై అధికారుల ఆదేశాలతో తంగళ్లపల్లి మండలంలోని పలువురి బీఆర్ఎస్ నేతలు, ఇద్దరు సింగిల్ విండో చైర్మన్లపై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్‌కు తరలించడం కలకలం రేపింది. సివిల్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అంతే కాదు జిల్లెల్లకు చెందిన సామాన్య రైతు రాజిరెడ్డిని సైతం ప్రభుత్వ భూమి కబ్జా చేశాడంటూ కేసు పెట్టి, జైలుకు పంపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంతకాలంగా స్థబ్దదగా ఉన్న తరుణంలో ఇటీవలే అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నేత కర్కబోయిన కుంటయ్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం, పోలీసుల తీరుపై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అది మరకముందే చీర్లవంచకు చెందిన వెల్పుల కృష్ణ అనే వ్యక్తి తనపై భూ పంచాయతీలో కేసు పెట్టారంటూ ఠాణాలో ఏకంగా ఎస్ఐ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. ఇలా వరుస ఘటనలతో తంగళ్లపల్లి పోలీస్టేషన్ పేరు మార్మోగిపోతోంది.
తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్‌ను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కుంటయ్య ఆత్మహత్య ఘటనతోనే ఎస్ఐ రామ్మోహన్‌ను బదిలీ చేస్తారని ప్రచారం జరిగింది. కుంటయ్య ఆత్మహత్య చేసుకోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించి, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ‘సివిల్ మ్యాటర్లో పోలీసులకు పనేంటీ అని,
సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్టేషన్లు మారాయి’ అని ఘాటుగా స్పందించారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు దిద్దుబాటు
చర్యలకు దిగారు. వరుసగా సివిల్ కేసులు వివాదస్పదం కావడంతో, సివిల్ కేసులు ఎఫెక్ట్‌తోనే జిల్లాలో ఎస్ఐల బదిలీల్లో భాగంగా తంగళ్లపల్లి ఎస్ఐని బదిలీ చేశారని చర్చించుకోవడం గమానార్హం.
జిల్లాల పునఃవ్యవస్తీకరణలో భాగంగా తంగళ్లపల్లి మండలం నూతనంగా ఏర్పాటైంది. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌ను 2016
అక్టోబర్ 11న అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 15 మంది ఎస్ఐలు పనిచేశారు. తాజాగా బదిలీ అయిన ఎస్ఐ రామ్మోహన్ గత ఏడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టి, కేవలం 9 నెలల్లోనే బదిలీ కావడం గమనార్హం. ఎస్ఐ రామ్మోహన్ హయాంలో ఆధికంగా సివిల్ కేసులు రాజకీయ, ఉన్నత అధికారుల ఒత్తిళ్లతో నేతలపై నమోదు కావడం గమనార్హం. విధేయతగా పనిచేసిన ఎస్ఐకి బదిలీ వేటు పడిందని పోలీసు వర్గాల్లోనే చర్చించుకోవడం విశేషం.