పండుగ వచ్చిందంటే చాలు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సుల పేరిట దోపిడీకి తెరతీస్తున్నది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై భారం మోపుతూ, సంబురం లేకుండా చేస్తున్నది. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే.. యాభై శాతం అదనపు చార్జీలతో మోత మోగిస్తున్నది. ఇప్పటికే మొదలైన ఈ ‘ప్రత్యేక దోపిడీ’ వచ్చే నెల 13 వరకు కొనసాగనుండగా, ప్రస్తుతం కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో అదనపు భారం వేస్తున్నది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ తీరుపై మండిపడుతున్నారు. ఎంతో ఆనందంగా ఇండ్లకు వెళ్తుంటే ఈ అదనపు చార్జీలను చూసి తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే మార్గంలో రెగ్యులర్ బస్సుల్లో ఒక చార్జీ, స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు ఏంటని మండిపడుతున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణచౌక్ : సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ‘స్పెషల్’ మోత మోగిస్తున్నది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే అదనపు చార్జీలతో బాదుతున్నది. కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు, అక్కడి నుంచి కరీంనగర్‌కు మాత్రమే కేటాయించిన ఈ బస్సుల్లో నిత్యం 25 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి, రాఖీపౌర్ణమి వంటి ప్రత్యేక పండుగల సందర్భంగా సుమారు 50వేల మంది ప్రయాణిస్తారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడిపించడం బాగానే ఉన్నా, అందులో అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతుందని, పండుగకు ఇంటికి వెళ్లాలనుకున్న తమను అదునుచూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా చార్జీలు తగ్గించాలని, ఈ కొద్ది రోజులు ప్రత్యేక బస్సులు నడపాల్సిన బాధ్యత ఆర్టీసీకి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, తదితర పట్టణాలకు చెందిన వేలాది మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు. పండుగలకు స్వగ్రామాలకు వస్తుంటారు. పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో కొందరు ప్రయాణమయ్యారు. ప్రత్యేక బస్సుల్లోనో.. రెగ్యులర్ బస్సుల్లోనో జేబీఎస్ నుంచి కరీంనగర్ వరకు ప్రయాణిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కరీంనగర్ నుంచి గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాలతోపాటు జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ నుంచి ఆయా డిపోలకు చెందిన బస్సులు ఎక్కువగా హైదరాబాద్ కరీంనగర్ మార్గంలోనే నడుస్తుండగా.. కరీంనగర్ నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు బస్సులు దొరకడం లేదు.
గత సంక్రాంతి పండుగకు ఇదే పరిస్థితి తలెత్తి, ప్రయాణికులు కరీంనగర్ బస్టేషన్లో గంటల తరబడి పడిగాపులు గాయాల్సిన దుస్థితి ఎదురైంది. ఇవన్నీ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చినా బస్సుల కొరతతో పరిష్కరించే అవకాశం లేకుండా పోతున్నది. ఈ నెల 25, 26 తేదీల నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, ఇటు జగిత్యాల మార్గంలో వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. కరీంనగర్ వరకు ప్రయాణం సాఫీగానే సాగినా.. ఇక్కడి నుంచి మళ్లీ సొంతూళ్లకు వెళ్లాలంటే ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇతర జిల్లా డిపోల నుంచి స్పెషల్ వస్తున్న బస్సుల్లో అదనపు చార్జీలు భరించి వెళ్లాల్సి వస్తున్నది. కాగా, అరకొరగా కేటాయించిన ఉచిత బస్సుల్లో సీట్ల కోసం ఎప్పటిలాగే ఆడబిడ్డలు ఎగబడ్డారు. ఉచిత బస్సులు పెద్దగా కనిపించక చాలామంది స్పెషల్ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు.
ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కరీంనగర్, హైదరాబాద్ మధ్య ప్రయాణించాలంటే సాధారణంగా 260 చార్జీ కాగా, దీని బేసిక్ చార్జీ మాత్రం 198 మాత్రమే. ఈ బేసిక్ చార్జీపై 50 శాతం అంటే 99 పెంచారు. దీనిని రెగ్యులర్ చార్జీలుగా ఉన్న 260 కలిపి మొత్తం 359 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా సూపర్ లగ్జరీ సర్వీసులకు 330 రెగ్యులర్ చార్జీ కాగా, బేసిక్ చార్జీ 260 ఉంది. కాగా, అందులో 50 శాతం 130ని రెగ్యులర్ చార్జీ 330కి జోడించి మొత్తం 460 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సామాన్య ప్రయాణికులపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో అన్ని రకాల బస్సులు కలిపి 930 వరకు ఉన్నాయి. అందులో కరీంనగర్, హైదరాబాద్ మధ్య 180 బస్సులు సుమారు 300 ట్రిప్పులు నడుస్తాయి. దసరా సందర్భంగా అదనంగా మరో 300కు పైగా ట్రిప్పులు ప్రతి రోజూ నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం రద్దీ తక్కువ ఉన్నందున ఎక్స్‌ప్రెస్‌లు, లగ్జరీ సర్వీసులు మాత్రమే స్పెషల్ బస్సుల కింద నడుపుతున్నా.. రద్దీ పెరిగితే పల్లె వెలుగు బస్సులను కూడా తిప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. పండుగ రోజుల సమయాల్లో ఈ మార్గంలో ప్రతి రోజూ 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశముంటుంది.
అంటే ఇప్పుడు నడిచే వాటికి అదనంగా మరో 150 నుంచి 170 సర్వీసులు పెంచాల్సిన అవసరముంటుంది. ఈ లెక్కన కరీంనగర్ రీజియన్ పరిధిలోని సర్వీసులనే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ డిపోలకు చెందిన బస్సులను కూడా నడిపించాల్సి ఉంటుంది. దసరా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పండుగకు ముందు అంటే ఈ నెల 20 నుంచి 30 వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 1,321 ట్రిప్పులు.. పండుగ తర్వాత అంటే అక్టోబర్ 2 నుంచి 13 వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు 1,330 ట్రిప్పుల చొప్పున మొత్తం 2,651 ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇవే కాకుండా రెగ్యులర్‌గా నడిచే సర్వీసులు కూడా నడుస్తాయని చెబుతున్నారు.
పండుగల సమయంలో ప్రత్యేక బస్సులు కాకుండా రెగ్యులర్ బస్సుల సంఖ్యనే పెంచాలి. ఉద్యోగరీత్యా నిత్యం నేను హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మంచిర్యాల పట్టణాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. బస్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. వచ్చిన బస్సులు కిక్కిరిసి వస్తున్నాయి. బస్ ఎక్కలేని పరిస్ధితి. సీటు కోసం చూస్తే ప్రయాణం ఆలస్యమవుతుంది. దీంతో ముఖ్యమైన సమావేశాలకు ఆలస్యంగా వెళ్లాల్సివస్తుంది. ప్రత్యేక బస్సులో వెళ్దామంటే టికెట్ ధర అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఉచిత ప్రయాణం లోటును ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో ధరలను పెంచి తీర్చుకుంటున్నట్టు ఉన్నది.
– అరుణ్, ప్రైవేట్ ఉద్యోగి
ప్రత్యేక బస్సుల పేరుతో టికెట్ ధరలు పెంచి ప్రభుత్వం పండుగల సంతోషం లేకుండా చేస్తుంది. ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేయడం బాగాలేదు. ఏడాదికి ఒకసారి పెద్ద పండులకు కుంటుంబాలతో గ్రామాలకు వెళ్తాం. రోజువారీ పనులతో ఆదాయం పొందే సామాన్యులు అదనపు ధర చెల్లిండం భారంగా మారింది. ప్రత్యేక బస్సులు కాకుండా అవే బస్సులను పాత టికెట్ ధరలకే నడిపించాలి. పండుగల పూట ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం బాగాలేదు. టికెట్ ధరలను తగ్గించి, రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలి.
– మొగిలి, ప్రయాణికుడు
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం అదనపు చార్జీలు వేస్తున్నాం. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు, ఇక్కడి నుంచి జేబీఎస్‌కు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. వీటి వల్ల ప్రయాణికులకు పెద్దగా భారంకాదు. ఆర్టీసీకి కూడా నష్టం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పండుగకు ముందు జేబీఎస్ నుంచి వచ్చే బస్సులు తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు లేకున్నా వెళ్లాల్సి వస్తుంది. ప్రత్యేక బస్సులు నడపడం వల్ల కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఏ రూట్లోనూ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్, కరీంనగర్ మధ్య రద్దీ పెరిగినప్పుడు అవసరమైతే పల్లె వెలుగు బస్సులను కూడా వినియోగిస్తాం. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి అదనపు చార్జీల కోసం ఆలోచించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతున్నా.
– బీ రాజు, కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ (ఆర్ఎం)