కలెక్టరేట్, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నాయి. నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 26,415 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, కరీంనగర్ సిటీ, రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల్లో 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెంటర్లలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మొత్తం 87 మంది అధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. రెండు విడుతలుగా నిర్వహించే పరీక్ష ఆదివారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లుగా, సోమవారం ఉదయం జరుగనున్నది. అభ్యర్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.
పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని, మహిళా అభ్యర్థులు ధరించే మంగళసూత్రం, గాజులు, సంబంధిత వస్తువులు మినహాయించి, ఇతరత్రా ఏ వస్తువులు కూడా అనుమతించబోరని శనివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు.టీజీఎస్పీఎస్సీ నిబంధనలు పాటిస్తూ, సజావుగా పరీక్షల నిర్వహణకు సహకరించాలని సూచించారు.