కరీంనగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండగ కోసమని చాలా మంది ప్రజలు నగరాలు, పట్టణాలు విడిచి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులు, నగదు దోచుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పండగకు సొంతూర్లకు వెళ్లే ప్రజలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌష్ ఆలం కొన్ని సూచనలు, జాగ్రత్తలు జారీ చేశారు. దొంగల బారిన పడకుండా వీటిని తప్పని సరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఊరికి వెళ్లినపుడు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని, దీని వల్ల పెట్రోలింగ్ పోలీసులు సంబంధిత నివాస గృహాలపై ప్రత్యేక నిఘా పెడుతారని స్పష్టం చేశారు.
అలాగే ఇరుగు పొరుగుకు కూడా సమాచారం ఇవ్వాలని, మీ ఇంటికి సంబంధించి ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మీకు తెలియజేయాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఊరికి వెళ్లేటప్పుడు ఎక్కువ బంగారం, డబ్బు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవాలని, బీరువాలో విలువైన వస్తువులుంటే వాటి తాళాలు ఇంట్లో పెట్టకుండా వెంట తీసుకెళ్లాలని చెప్పారు. మీరు ఊరు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, నేరగాళ్లు తెలుసుకుని, మీ ఇల్లు ఖాళీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంట్లో లైట్లు వేసి ఉంచాలని, తాళం బయటికి కనిపించకుండా డోర్ కర్టెన్ వేయాలని, ఇంట్లో, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానితులపై నిఘా ఉంచాలని, అలాంటి వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలపైనా అలర్ట్‌గా ఉండాలని, పండగ పేరిట వచ్చే ఆన్‌లైన ఆఫర్ల లింకులతో మోసపోవద్దని, బ్లూ కలర్ లింకులు అస్సలు ఓపెన్ చేయవద్దని, లాటరీ తగిలిందని, తక్కువ ధరకు గిఫ్ట్ వచ్చిందని వచ్చే మెస్సేజ్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. సైబర్ నేరానికి గురై డబ్బులు పోగొట్టుకున్నట్టయితే వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అత్యవసర సహాయం కోసం జాతీయ హెల్ప్‌లైన్ 112, 100కు కాల్ చేయాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ సూచించారు.