రామగిరి, మార్చి 7: సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం సంభవించింది. కార్మికులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిక్కుకోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం మొదటి షిఫ్టులో 11.35 గంటలకు ఘోర గని ప్రమాదం సంభవించింది. గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. సరిగ్గా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, గని డిప్యూటీ మేనేజర్ తేజతోపాటు మైనింగ్ సర్దార్ పిల్లి నరేశ్, ఆపరేటర్ జోడి వెంకటేశ్, సపోర్ట్‌మెన్ ఎరుకల వీరయ్య, బదిలీ వర్కర్ రవీందర్‌తోపాటు కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. 86వ లెవల్ వద్ద దాదాపు 3 మీటర్ల పొడవున, 20 మీటర్ల వెడల్పుతో రూఫ్ పాల్ జరుగడంతో అధికారులతోపాటు కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ టీం బృందంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తోటి కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు, అధికారులంతా గనిపైకి చేరుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
సుమారు 3 గంటల ఉత్కంఠ అనంతరం ఎరుకల వీరయ్య అనే సపోర్టుమెన్ కార్మికుడు బతికి బయట పడ్డాడు. మిగతా ఐదుగురిలో ఇద్దరు కార్మికుల నుంచి శబ్ధం వినిపిస్తుండడంతో శిథిలాలను తొలగించే చర్యలు వేగిరం చేశారు. ప్రమాదం జరిగిన 8 గంటల తర్వాత బొగ్గు కింద చిక్కుకున్న కార్మికులు జాడి వెంకటేశ్, నరేశ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స కోసం గోదావరిఖని ఏరియా దవాఖాకు తరిలించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సింగరేణిలోనే అత్యంత అధునాతన విదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న అడ్రియాలలాంగ్వాల్ ప్రాజెక్టులో ఇంతటి పెద్ద ప్రమాదం జరుగడం ఇదే మొదటిసారి.