న్యూశాయంపేట : రాజ్యాధికారం కోసం మాదిగలు ( Madigas ) సంఘటిత శక్తిగా చైతన్యం కావాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు (Motukupalli Narasimhulu) పిలుపునిచ్చారు . ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డు డి కన్వేషన్ లో ఓయూ స్కాలర్ పెండ్యాల విక్రమ్ అధ్యక్షతన మాదిగ శక్తి ఆత్మీయ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మాదిగ దండోరా ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు అమరులయ్యారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో వారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. అమరుల స్తూపం, కోటి రూపాయలు, ఇంటికో ఉద్యొగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారని తెలిపారు. రాష్ట్రంలో అరకోటికి పైగా జనాభా ఉన్న మాదిగలు ఓట్లకే పరిమితమవుతూ అనాధలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం లేకపోవడమే మన జాతి వెనుకబాటు తనానికి కారాణమని పేర్కొన్నారు.
రాజ్యాధికారం కోసం సంఘాలకు అతీతంగా ఏకమై , ఎవరికి తలవంచకుండా ఆర్ధిక, రాజకీయ మార్పు కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే లక్షలాది మాదిగలతో మాదిగ గర్జన సభతో సత్తా చాటి, రాజకీయ శక్తిగా ఎదిగి, రాజ్యాధికారం సాధించుకుందామని వెల్లడించారు.
ఈ సదస్సులో యూనివర్సిటీల ప్రొపెసర్లు విద్యాసాగర్, కనకయ్య, తిరుపతి , మురళి దర్శన్, మాజీ ఎంపీ పసూనరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, హైకోర్టు న్యాయవాదీ బైరపాక జయకర్, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అర్షం రాజ్ కుమార్ పాల్గొన్నారు.