Room Heaters : దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా మంది రూం హీటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పంజాబ్ లోని తార్న్ తరాన్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. రూం హీటర్ వాడిన ఒక యువ జంట, వారి నెలల శిశువు గదిలోనే మరణించారు.
రూం హీటర్ నుంచి విడుదలైన వేడితోపాటు విష వాయువులు పీల్చడం కూడా దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. నిపుణుల ప్రకారం.. రూం హీటర్లు సైలెంట్ కిల్లర్లుగా పని చేస్తాయి. ఇవి కార్బన్ మోనాక్సై్డ్ ను విడుదల చేస్తాయి. ఇది రంగు, రుచి, వాసన లేని వాయువు. అందువల్ల గుర్తించడం కష్టం. సాధారణంగా రూం హీటర్లు, కొన్ని రకాల బొగ్గు హీటర్లు, ఇతర హీటింగ్ డివైజెస్ కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తాయి. వీటిని గదిలో వాడేటప్పుడు తలుపలు, కిటికీలు పూర్తిగా మూసేస్తారు. దీంతో వీటి నుంచి విడుదలైన విషవాయువు లోపలే ఉండిపోతుంది. ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా గదిలోని వారికి తలనొప్పి, వాంతులు, వికారం వంటివి వస్తాయి. ఇది గమనించి, చికిత్స తీసుకునేలోపే ప్రాణాలు కోల్పోవచ్చు.
ఫలితంగా ఇటీవలి కాలంలోనే రూం హీటర్స్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఉత్తరాదిన చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలా మంది ఇలాంటివాటిపై ఆధారపడుతున్నారు. హీటర్స్ వాడేటప్పుడు గది తలుపులు తెరిచి ఉంచాలని, గాలి బయటకు వెళ్లేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.