Zinc Supplements | వాతావరణం మారినప్పుడు, చలికాలంలో అలాగే వైరల్ వ్యాప్తి జరిగినప్పుడు మనలో చాలా మంది ముక్కు కారడం, గొంతునొప్పి, శరీర నొప్పులు, దగ్గు, తుమ్ములు, జలుబు, అలసట వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. జలుబు సాధారణంగా మందులు వాడే అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఫ్లూ శరీరాన్ని నీరుగార్చి బలహీనపరుస్తుంది. ఫ్లూ వల్ల మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జలుబు నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు అనేక నివారణ చర్యలు చేస్తూ ఉంటారు. ఇంటి చిట్కాలను కూడా వాడుతూ ఉంటారు. అయినప్పటికీ దగ్గు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి వాటి నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల సమస్య పూర్తిగా తగ్గకపోయినా సమస్య తీవ్రత, వాటి లక్షణాలు తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు. జలుబుతో బాధపడే సమయంలో జింక్ సప్లిమెంట్స్ ఒక సహాయకారిగా పనిచేస్తాయి.
సాధారణ జలుబు ఎటువంటి చికిత్స అవసరం లేకుండా సాధారణ సమయ వ్యవధిలో దానంతట అదే తగ్గుతుంది. అయితే ఈ సమయంలో జింక్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జలుబు కాల వ్యవధిని తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే ఈ జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల గొంతునొప్పి, ముక్కు చికాకు వంటి లక్షణాల తీవ్రత కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధికి చికిత్స తీసుకునే సమయంలో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కనుక జలుబు చేసిన వెంటనే అనగా జలుబు చేసిన 24 గంటలలోపు జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వివిధ రకాల జింక్ సప్లిమెంట్స్ శరీరంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. గొంతు, నాసికా భాగాల్లో ప్రత్యక్ష సంబంధంలోకి జింక్ వస్తుంది. కనుక టాబ్లెట్లు లేదా సిరప్ ల కంటే జింక్ సప్లిమెంట్స్ మరింత ప్రభావవంతంగా పని చేస్తాయని వారు చెబుతున్నారు.
జలుబు తీవ్రతను లక్షణాలను తగ్గించినప్పటికీ జింక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా మందును సరైనా పద్దతిలో సరైన మోతాదులో తీసుకున్నప్పుడే అది మన శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ దానిని అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జింక్ సప్లిమెంట్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రోజుకు 75 నుండి 90 మిల్లీ గ్రాముల జింక్ ను మాత్రమే తీసుకోవాలి. ఈ జింక్ సప్లిమెంట్స్ ను ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరం రాగి శోషణలో, రోగనిరోధక వ్యవస్థలో అటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా జుట్టు సంరక్షణలకు ముందు నుండే జింక్ సప్లిమెంట్స్ వాడుతున్నవారు అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని కూడా వైద్యులు చెబుతున్నారు. కనుక జలుబుకు జింక్ సస్లిమెంట్స్ ను వాడే వారు ముందుగా వైద్యున్ని సంప్రదించి ఏ రకమైన మందులు వాడితే మంచిదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.