Former MLA Ravi Shankar | గంగాధర, ఆగస్టు 23 : రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా, రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. యూరియా కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ మధురానగర్ చౌరస్తాలో నిరసన తెలిపేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ను బలవంతంగా అరెస్టు చేసి పోలీసులు గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను ఈడ్చుకు వెళ్లి వాహనాల్లో ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలుపడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని నాయకుల పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపులాటలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు కాలికి గాయమైంది. మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు విడిచిపెట్టారు.
జనహితయాత్ర కాదు జన హింస యాత్ర.. : మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్ర జనహితయాత్ర కాదని, అది జన హింస యాత్ర అని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు రైతాంగ సమస్యలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే కారణమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలే యూరియా కొరతను సృష్టిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తలతోకా లేకుండా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారే రైతులతో చెప్పులను లైన్లో పెట్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం ఆయన అవగాహన లేమికి నిదర్శనం అని మండిపడ్డారు. అంతా అయిపోయిన తర్వాత రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
దాదాపు రెండు నెలలుగా రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతుంటే, వారి కష్టాలు తీర్చాలన్న సోయి కేంద్రమంత్రికి లేదన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు యూరియా సప్లై చేస్తామని నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెలల తరబడి యూరియా దొరకక కడుపు పండిన అన్నదాతలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే, పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారని, గల్లాలు పట్టి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు రాజ్యం నడవడం లేదని, రాక్షస రాజ్యం నడుస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే కేంద్రంతో మాట్లాడి రైతులకు సరిపడా యూరియాను తీసుకువచ్చిన సంగతి కాంగ్రెస్, బీజేపీల నాయకులు గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకొచ్చిందో రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా సప్లై చేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.