కోల్సిటీ, డిసెంబర్ 15 : వారం రోజుల నుంచి చలి భయపెడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 11 డిగ్రీలకు చేరువ కావడంతో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకుంటున్నది. రాత్రిళ్లే కాదు, పొద్దంతా ఇగం పెడుతున్నది. చల్లని గాలులతో వణుకు పుడుతుండగా, కోల్బెల్ట్లో మరీ దారుణంగా మారింది. ఉదయం 9గంటలు దాటినా మంచు కమ్మేసి ఉంటున్నది. పొద్దంతా ప్రజలు ఇండ్ల నుంచి రాలేని పరిస్థితి ఉంటుండగా, సాయంత్రం 5గంటల్లోపే రోడ్లపై సంచారం తగ్గిపోతున్నది. తుఫాను ప్రభావంతో మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.