Jagityal | కోరుట్ల, జూన్ 2: బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా తెలంగాణ అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.
ఈమేరకు ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో నిలిచిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందన్నారు. సబ్బండ వర్గాలకు అభివృద్ది, సంక్షేమ పథకాల్లో సమప్రాధాన్యం దక్కిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కు వచ్చిన పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేక రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ కేటీఆర్, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీటులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్ర స్తావించిన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శులు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, నాగుల లక్ష్మణ్, సంగేపు సందీప్, తదితరులు పాల్గొన్నారు.