తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఊరూరా పండుగను తలపించాయి. కలెక్టరేట్లు, పరేడ్ గ్రౌండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేశారు. అమరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన వేడుకల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి, ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. కరీంనగర్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, జగిత్యాలలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గితే, పెద్దపల్లిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యాలయల్లో వేడుకలు ఘనంగా జరిపారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పెద్దపల్లిలో జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధూకర్, జగిత్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సిరిసిల్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. నాటి ఉద్యమ రోజులు, కేసీఆర్ చేసిన పోరాటం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 2: ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను తోట ఆగయ్య ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఉద్యమ పోరాటంతోనే ఫలించిన రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దారని కొనియాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన అందించారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల, జూన్ 2 : పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులతో కలిసి జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ సాధనే ధ్యేయంగా సబ్బండవర్గాలను ఏకంచేసి రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.
పదేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు చేట్టారన్నారు. సీఎం ఫొటో లేదని కాంగ్రెస్ గుండాలు క్యాంప్ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అధినేత తెలంగాణ ప్రజలను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.
పెద్దపల్లి, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి మన కళ్ల ముందే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నీళ్లు దోచుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లుండి కూడా చూడకుండా ఉంటున్నాడని పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జాతీయ జెండా, పార్టీ పతాకాన్ని ఆవిషరించి మాట్లాడారు. మన హకులను కాలరాస్తూ పక రాష్ర్టానికి నీళ్లు ఇవ్వడం దుర్మార్గమని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ఆవిర్భావం బీఆర్ఎస్తోనే సాధ్యమైందనే విషయం యావత్తు ప్రపంచానికి తెలుసన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం ఫెయిల్ అయిందని అంటున్నారని, కానీ తాను ఇటీవల ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బూర్గుగూడెం వెళ్తే అకడ మిషన్ భగీరథ నీళ్లు తప్ప వేరే లేవని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కళ్లున్నా చూడలేని కబోదులని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టాలని, గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ అవినీతిని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత మాటలతో మోసపోయామని తెలంగాణ ప్రజలు గ్రహించారు. పధ్నాలుగు ఏండ్ల కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో.. అంటూ చేసిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ వచ్చింది. రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు పాలన చేసిన కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని గొప్పగా తీర్చిదిద్దారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఆలోచనకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కాంగ్రెస్ పాలనతో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరించాలి.
– మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి