Telangana Rising-2047 | పెద్దపల్లి, జూన్ 2(నమస్తే తెలంగాణ): దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెం.1 రాష్ట్రంగా నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 పాలసీని రూపకల్పన చేసి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె పోలీసు గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మహిళలకు రూ. 139 కోట్ల 40 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. నా నాటికి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారం మహిళలపై పడకుండా గ్యాస్ సిలిండర్ ను రూ. 500ల సబ్సిడీపై ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 17 వేల 856 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సీడిపై సరఫరా చేసి సంబంధిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో 14 కోట్ల 3లక్షల రూపాయలు సబ్సీడీ సోమ్ము జమ చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు. గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుంది జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 74 కోట్ల 23 లక్షల రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించి 1,31,187 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం క్రింద జిల్లాలో మహిళా సంఘాలచే 27కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టిస్తున్నామని, 4 క్యాంటీన్, మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లెట్లు ఏర్పాటు చేశామని, రెండు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన వంటి వివిధ కార్యక్రమాల అమలకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. యాసంగి సీజన్ నుంచి పెట్టుబడి సహాయాన్ని రూ. 12వేల రూపాయలకు పెంచి పెద్దపల్లి జిల్లాలో 1,21,698 మంది రైతుల ఖాతాలో 88 కోట్ల 86 లక్షల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసామని మహిళా కమీషన్ చైర్ పర్సన్ అన్నారు. మార్చ్, ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన 3556 ఎకరాలకు పదివేల చొప్పున పరిహారం జమ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లాలోని రైతులకు వరి వంగడాలకు సంబంధించిన విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మహిళ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, డి. వేణు, డిసిపి కరుణాకర్, ఆర్డిఓ బి. గంగయ్య, ఏఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.