Putta Madhukar | మంథని, జనవరి 15: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి దూరమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాలం పాలనలో అభివృద్ధిలో పరుగులు తీస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలోనే అభివృద్ధిలో వెనుకకు వెళ్లి పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని రాజగృహాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులను గురువారం ఆయన సతీమణి, మంథని మునిసిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.
చలి కాలం నుంచి ఎండకాలంకు ఆహ్వనించే సందేశంగా పతంగులను ఎగురవేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆకాశమే హద్దుగా ఎదుగాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. అలాగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్ పాలనను అంతమొందించే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పతంగుల్లా ఎగురాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏగోలపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, మాచీడి రాజు గౌడ్, ఆరేపల్లి కుమార్, కాయితి సమ్మయ్య, కన్నవేన శ్రీనివాస్ గొబ్బూరి వంశీ, పిల్లి సత్తయ్య, జంజర్ల శేఖర్, కరెంగుల సుధాకర్ లు పాల్గొన్నారు.