కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయగా, ఆ మేరకు ఆయా జిల్లాల్లో అంతా సిద్ధమైంది. ముందుగా ఈ నెల 6,7,8 తేదీల్లో ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ)ల వారీగా హౌస్ లిస్టింగ్ చేస్తారు. ఆ మేరకు విధివిధానాలను ఇప్పటికే ఎన్యుమరేటర్లకు వివరించిన అధికారులు, అందుకు సంబంధించిన సామగ్రిని అందించడంతోపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు.
కరీంనగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం ముందుగా కులగణన సర్వే చేయాలన్న అంశంపై చర్చ జరిగింది. అందుకోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలో కులగణన సర్వే చేసి, తద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ బీసీ సంఘాల నుంచి వ్యక్తమైంది. ఆ మేరకు ముందుగా కులగణనకు ఓకే చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నది. కుటుంబానికి సంబంధించి ఆస్తిపాస్తుల వివరాలే కాకుండా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ పరిస్థితులతోపాటు తదితర వివరాలు తెలుసుకోవాలన్న లక్ష్యంతో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. కులగణనే ప్రధాన ఇతివృత్తంగా సాగాల్సిన సర్వేలో ప్రస్తుతం అదో అంశంగా మాత్రమే ఉన్నది. ఆ లెక్కల ఆధారంగా అనేక అంశాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వం ఒక కుటుంబ యజమాని నుంచి 75 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు ఫార్మాట్‌ను తయారు చేసింది. నిజానికి 56 ప్రశ్నలే కనిపిస్తున్నా, అందులో ఉప అంశాలు కలిపి చూస్తే 75 విషయాలపై కుటుంబ యజమాని సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఈ నెల 6 నుంచే ఇంటింటి సర్వే ప్రారంభం కావాలి. కానీ, ఈ నెల 1నుంచి 5వరకు చేయాల్సిన హౌస్‌లిస్టింగ్ సర్వే మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తిరిగి ఈ నెల 6,7,8 తేదీల్లో హౌస్‌లిస్టింగ్ సర్వే చేసిన తర్వాత కుటుంబ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా సేకరించిన నివాసాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని, ఎన్యు మరేషన్ బ్లాక్‌ల జాబితా తయారు చేశారు. అయితే గడిచిన 14 ఏళ్లలో భారీగా గృహాలు పెరుగగా, ముందుగా వీటిని గుర్తించేందుకు హౌస్ లిస్టింగ్‌ను చేపడుతున్నారు. 2011 జనాభా లెక్కల కోసం అనుసరించిన ఒక్కో ఎన్యుమరేషన్ బ్లాక్‌లో కొత్తగా నిర్మాణమైన ఇండ్లను గుర్తించి, ఇంకా ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందా..? లేదా అనేది ముందుగా నిర్ధారిస్తారు. అంతేకాదు, హౌస్ లిస్టింగ్ పూర్తయితేనే ఒక ఎన్యు మరేషన్ బ్లాక్‌లో ఎన్ని ఇండ్లు ఉన్నాయన్నది కచ్చితంగా తెలుస్తుంది. ఆ సంఖ్యను బట్టి సిబ్బందిని పెంచడం లేదా తగ్గించడం, బ్లాక్‌లను పెంచడం వంటివి చేస్తారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా గుర్తించిన నివాసాల సంఖ్య ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 10,84,537గా నమోదై ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతంలో 7,08,363, పట్టణ ప్రాంతంలో 3,76,174 నివాసాలున్నాయి. వీటి గణన కోసం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 7,338 ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా కుటుంబ సర్వే చేసేందుకు 7,480 మంది ఎన్యుమరేటర్లను గుర్తించారు. అయితే హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తయితే ఎన్యుమరేటర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
1