రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులపై అయోమయం కనిపిస్తున్నది. అర్హులకు కార్డులు ఇచ్చేందుకు ఈ నెల 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగ్గదే అయినా, అమలు తీరుతెన్నులపై మాత్రం స్పష్టత కొరవడింది. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. ఇంకోవైపు ఈసారి రేషన్‌కార్డులు, ఆరోగ్య కార్డులు వేర్వేరుగా ఇస్తామని సర్కారు చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డులు (ఆహారభద్రత) కొనసాగుతాయా..? లేదా..? కొత్తగా ఉమ్మడి జిల్లాలో 65వేల పైచిలుకు మంది చేసిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా..? లేక మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? నెలల తరబడిగా ప్రజావాణికి వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తారు? అన్నది తెలియడం లేదు. మరోవైపు మంత్రి వర్గ ఉపసంఘం సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్న నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతుండగా.. ప్రభుత్వం మాత్రం అధికార యంత్రాంగానికి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గత నెల (ఆగస్టు) 27న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అందుకోసం ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నది. అందులో భాగంగా అర్హులకు రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలు సేకరిస్తామని చెప్పింది.
రాష్ట్రంలో ఇక ముందు రేషన్ కార్డులకు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డుల మంజూరు, విధివిధానాలపై చర్చించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ముందుగానే నియమించిన విషయం తెలిసిందే. ఉప సంఘం ఆగస్టు 10న మొదటిసారి భేటీ అయింది.
ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా కార్డులకు జారీకి సంబంధించి సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఇదే సమయంలో తెల్లరేషన్ కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలోపు వార్షికాదాయం, మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, పట్ణణ ప్రాంతాల్లో వార్షికాదాయం 2 లక్షలోపు ఉండాలనే ప్రతిపాదనలొస్తున్నాయని, అన్నింటిని పరిశీలించి విధివిధానాలు నిర్ణయిస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మంత్రి వర్గ ఉపసంఘం ఇంకా ప్రభుత్వానికి నివేదిక మాత్రం ఇవ్వలేదన్నది స్పష్టం.
ఇప్పటి వరకు ఆహారభద్రత కార్డుతో ఆరోగ్య శ్రీ కూడా లింకు అయి ఉన్నది. ఈ నేపథ్యంలో తెల్లకార్డు తీసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతూ వచ్చారు. నిజానికి చాలా మందికి నెలవారీగా ఇచ్చే బియ్యం అవసరం లేకపోయినా, ఆరోగ్యసేవలను దృష్టిలో పెట్టుకొని తెల్లకార్డు పొందిన కుటుంబాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం రెండు కార్డులు వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేస్తున్నది. అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న ఆహారభద్రత కార్డులను కొనసాగిస్తారా..? లేక వాటి స్థానంలో తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటారా..? అన్నదానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. అందరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వానికి కొన్ని లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశముంటుంది. అంతేకాదు, లక్షల్లో దరఖాస్తుదారులు రోడ్డుమీదకు వచ్చే ప్రమాదముంటుంది. అలాగే హెల్త్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటే తెల్లకార్డును ఉంచుతారా..? తొలగిస్తారా..? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కొన్ని నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది వచ్చి కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే 65,498 మంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరు తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? లేక ప్రస్తుత దరఖాస్తులను కన్సిడర్ చేస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒక ఉన్నతాధికారి మాత్రం కొత్త దరఖాస్తులు ఒక కొత్త ఫార్మెట్లో చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతం చేసుకున్న అంటే పాత దరఖాస్తులు ఏవి కూడా పనికి రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా.. లేదా ఆరోగ్య కార్డు కావాలన్నా కచ్చితంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమే ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1965 రేషన్ దుకాణాలుండగా, వీటి పరిధిలో 9,80,261 ఆహారభద్రత కార్డులున్నాయి. వీటి పరిధిలో 28,64,897 కుటుంబ సభ్యులున్నారు. మొత్తంగా చూస్తే కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారుల వద్ద ఎలాంటి స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో విధి విధానాలు ఎంత తొందరగా ఇస్తే.. ప్రజల్లో అంత తొందరగా అయోమయ పరిస్థితి తొలిగిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.