కరీంనగర్, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం రాత్రి గన్పార్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అమరజ్యోతి వరకు అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని తీశారు. ఈ సందర్భంగా అమరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత హాజరై, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణలో పదేండ్ల స్వయంపాలనకాలం దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిపిందని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను వృథాపోనీయకుండా పదేండ్ల పాటు ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని ప్రజాసంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బాధ్యతతో, చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా, తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తితో ముందుకెళ్లడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆది, సోమవారాల్లో పార్టీ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని, నాటి ఉద్యమ స్పూర్తిని చాటుతూ.. విజయవంతం చేయాలని మరోసారి తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులు బోయినపల్లి వినోద్‌కుమార్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
నేడు (ఆదివారం): దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. అదేరోజు హైదరాబాద్‌లో పలు దవాఖానలు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోపాటు ప్రతి నియోజకవర్గం నుంచి నాయకులు తరలివెళ్లనున్నారు.
రేపు (సోమవారం): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు.