Thota Agaiah | సిరిసిల్ల టౌన్, జూన్ 2: ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండాను పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆవిష్కరించారు. స్థానిక తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం స్థానిక కొండా లక్ష్మన్ బాపూజి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఉద్యమ పోరాటంతోనే ఫలించిన రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దారని కొనియాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన అందించారని తెలిపారు. రాబోవు రోజుల్లో కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, మాజి ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్‌రెడ్డి, మాజి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ మాజి చైర్మన్ జిందం కళ, ఆయా మండలాల ఫ్యాక్స్ చైర్మన్లు, మాజి జడ్పిటిసిలు, ఎంపిపిలు, మాజి కౌన్సిలర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో..
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజి విగ్రహం వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, ఆయా పార్టీ నేతలు పాల్గొన్నారు.