Teachers | జగిత్యాల, మే 31: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని ఒక పక్క ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం కాదని స్టేట్ టీచర్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అభ్యసనా సామర్థ్యాలను పెంచాలని అందుకు ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతుందని, ఈ సంవత్సరం నమోదు పెంపుకోసం సమిష్టిగా కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పాఠశాలలు ప్రారంభం కాకుండానే, విద్యార్థుల నమోదును పట్టించుకోకుండా జూన్ 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికొక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సంఘాలు కోరుతున్నా పట్టించుకోకుండా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు పేరిట ఇతర పాఠశాలలకు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక విద్యా రంగానికి గొడ్డలి పెట్టని, దానిని తక్షణమే విరమించుకోవాలన్నారు.
జులై 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆగస్టు ఒకటి తరువాత సర్దుబాటు చేయాలని కోరారు. 10 మంది లోపు ఒక ఉపాధ్యాయుడు, 11 నుండి 60 మంది వరకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండాలని ఆదేశించడం ఆశాస్రీయమని పేర్కొన్నారు. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపే ఉంటుందని, ఉన్న ఉపాధ్యాయులను తొలగిస్తే తల్లిదండ్రులకు నమ్మకం ఎలా కలుగుతుందో అధికారులు ఆలోచించాలన్నారు. కనీసం 40 వరకు ఇద్దరు, 41 నుండి 60 వరకు ముగ్గురు, 61 నుండి 90 వరకు నలుగురు ఉండే విధంగా నిబంధనలు సవరించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. ప్రాథమిక పాఠశాలలను సహజ మరణానికి గురిచేసే ఈ సర్దుబాటు ఉత్తర్వులు, జీవో 25లను సవరణ చేయాలని కోరారు.