గోదావరిఖని/ యైటింక్లయిన్కాలనీ/ రామగిరి, సెప్టెంబర్ 19: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలైనా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లాభాల వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగింది. గురువారం సింగరేణి ఆర్జీ-1, 2, 3 జీఎం కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు చేసి, జనరల్ మేనేజర్లకు వినతి పత్రాలు అందజేసింది. సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేయగా, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితోపాటు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ఆర్జీ-1 జీఎంకు వినతిపత్రం అందజేశారు. అలాగే రామగుండం ఆర్జీ-2 ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఆర్జీ-2 టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఇక రామగిరిలోని ఆర్జీ -3 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పింగిలి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేసి, పర్సనల్ మేనేజర్ సుదర్శనంకు వినతి పత్రం అందజేశారు.
2023-24 సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, ఈ నెలాఖరు వరకు 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎప్పుడూ లేని విధంగా 70మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగిందని, ఆర్థిక సంవత్సరం గడిచి ఆరు నెలలు దాటిన వాస్తవ లాభాలను ప్రకటించండంలో యాజమాన్యం ఎందుకు జాప్యం చేస్తున్నదో చెప్పాలన్నారు.
గతానికి భిన్నంగా ఈ ఏడాది ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, దసరా పండుగ సమీపిస్తున్నందున ఈ నెలాఖరు వరకు లాభాల్లో వాటా ప్రకటించాలన్నారు. లేదంటే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం, హైదరాబాద్లో భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అందుకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.