TB patients | పాలకుర్తి: టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులు, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ లోపు మండలం పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహణ చేయాలని కలెక్టర్ సూచించారు.
అంతేకాకుండా ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించిన షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు.