కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 18: రిటైర్డ్ ఉద్యోగులపై సర్కారు కత్తిగట్టిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోస పెడుతున్నదని తెలంగాణ ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మండిపడ్డారు. రెండేండ్లుగా పెండింగ్లో పెట్టి వేధించడం సరికాదని, బెనిఫిట్స్ సకాలంలో విడుదల కాకపోవడంతో ఎంతో మంది మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకెంత మంది చనిపోవాలని, ఇంకెనాళ్లకు బెనిఫిట్స్ ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు కరీంనగర్ జిల్లా నుంచి వందమందికి పైగా టాప్రా సభ్యులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 మార్చి నుంచి విరమణ పొందిన అనేక మంది పెన్షనర్లకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
రెండేళ్లుగా వేధించడం సరికాదని, తమ బాధలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పం దించి ఏకమొత్తంలో చెల్లించాలని, లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2023 జూలై నుంచి కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేస్తూ పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు వెళ్లిన వారిలో సంఘ జిల్లా శాఖ ప్రతినిధులు గడ్డం అశో క్, కట్ట నాగభూషణాచారి, ఇరువంటి తిరుమలయ్య, భారత ప్రభాకర్, గాజర్ల బుచ్చిరాజం, చీకట్ల సమ్మయ్య, మండల వీరస్వామి, బొంగోని వెంకటయ్య, తాటిపాముల కనకయ్య ఉన్నారు