కరీంనగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ‘కులగణన’ చిచ్చు రగులుతూనే ఉన్నది. రిజర్వేషన్లపై నాలుక మడతపెట్టిన కాంగ్రెస్‌పై బడుగుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతూనే ఉన్నది. కులగణన నివేదిక ఓ తప్పుల తడక అని, తమ కులాలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాల నాయకులు రగలిపోతూనే ఉన్నారు. రోజు రోజుకూ తమ గళాన్ని పెంచుతూనే ఉన్నారు. ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డమైన నిర్ణయాలతో రచ్చ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నదని ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు పాతరేసి, కొత్త పాట పాడుతున్నదని ధ్వజమెత్తారు. సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని, పార్టీ పరంగా అమలు చేస్తామని చెబుతున్నదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సర్వేకు, పదేళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన సర్వేకు కుల సంఖ్య పెరగాలే గాని, ఇలా తగ్గడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అగ్ర కుల రిజర్వేషన్లను కాపాడుకునేందుకే బీసీల సంఖ్యను ఉద్దేశ పూర్వకంగా తగ్గించి చూపారని ఆగ్రహిస్తున్నారు. ఇంటింటి సర్వేను సర్కారు పూర్తిగా అశాస్త్రీయంగా నిర్వహించిందని, సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. ఒక పక్క సర్వే పూర్తి కాకముందే నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని, అందులోనూ తప్పుడు లెక్కలు ఉన్నాయని మండిపడుతున్నారు. గణాంకాలు సరిగ్గా లేకపోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయని, కాంగ్రెస్ ఖాతాలో మరో మరక పడిందని చెబుతున్నారు. ఇప్పటికైనా కులగణన పూర్తి శాస్త్రీయంగా చేపడితేనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకలా మారిన నివేదిక తమ ఉనికికి ప్రమాదంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం పునఃసమీక్షించి తప్పులను సరిదిద్దాల్సిందేనని, అవసరమైతే రద్దు చేసి రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నదన్నారు. రిజర్వేషన్ల పేరిట తమను మోసగిస్తే ఊరుకునేది లేదని, అమలయ్యే వరకూ పోరాడుతామని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ చేసిన బీసీల కుల గణన బూటకపు సర్వే. అందుకే పొంతన లేకుండా ఉంది. తెలంగాణలో మళ్లీ సమగ్ర సర్వే చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి. బీసీల శాతాన్ని తగ్గించి, వారి రిజర్వేషన్లను తగ్గించాలనే కుటిల నీతితో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నది. ఆ పార్టీ మొదటి నుంచి బీసీల వ్యతిరేకిగానే ఉన్నది. అగ్ర వర్గాలకు కొమ్ముకాస్తున్నది. బీసీలకు చెందాల్సిన వాటా తప్పకుండా దక్కాలి. కుల గణన సంపూర్ణంగా చేసి అన్ని రిజర్వేషన్లు సంపూర్ణంగా కేటాయించాలి. బీసీలతో పెట్టుకుంటే కాంగ్రెస్‌ను బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి చర్యలను బీసీ జనాభా అంతా గమనిస్తున్నది. కామారెడ్డిలో చెప్పిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎన్నికల వేళ బీసీలను మచ్చిక చేసుకోవడానికి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతండు. అప్పటికే మేధావులు రిజర్వేషన్లు ఆ స్థాయిలో ఇస్తే సమస్యలు వస్తాయని చెప్పినా కూడా అవేం పట్టించుకోకుండా బీసీల ఓట్లను వాడుకోవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిండు. ఇప్పుడు రిజర్వేషన్ తగ్గిస్తామంటే ఊరుకోం. బీసీల దమ్మేంటో చూపిస్తం. బీసీలతో పెట్టుకుంటే వచ్చే స్థానిక సంస్థల్లో ఎలా ఉంటుందో చూస్తరు. ఇప్పుడు మాట మార్చి పార్టీ పరంగా 42 శాతం ఇస్తానని మాత్రమే చెప్పానని అంటున్నడు. మీ పార్టీ గురించి మాకెందుకు? ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి. లేదంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఎదురొంటం.
బీసీలకు పథకాలు, ఇతర ప్రయోజనాలు రాకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన నాటకం ఇది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. 56శాతం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభాను తగ్గించి చూపినప్పుడే వారి బుద్ధి ఏంటో అర్థమైపోయింది. కొన్ని వర్గాలకు మేలు చేసేందుకు లెక్కల్లోంచి బీసీ జనాభాను మాయం చేస్తరా..? ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అన్నది స్పష్టమైంది. విద్యా, వైద్య, రాజకీయ రంగాలలో 56శాతం అమలు చేయాల్సిందే. అందుకు రీసర్వే చేపట్టాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలను అణిచివేస్తున్నది. అందుకే కులగణనలో తక్కువ చేసి చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 51 శాతం ఉన్న బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో 46 శాతానికి ఎలా తగ్గిపోతారో చెప్పాలి. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు మాట తప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్ర సర్వేనే బాగుందని, సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెబుతుంటే ప్రభుత్వానికి కనువిప్పు కలుగకపోవడం బాధాకరం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా కల్పించాల్సిందే. దీనిపై చట్టం తీసుకువస్తేనే న్యాయం జరుగుతుంది. బీసీ కులగణన సర్వే పూర్తిగా తప్పుల తడకగా ఉంది. పదేండ్ల కింద ఉన్న లెక్క కంటే ఇప్పుడు తగ్గడం చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది. దాన్ని సరి చేయాలి. కులగణన సర్వే మళ్లీ చేయాలి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలి. ఎన్నికల్లోనే కాదు ఉద్యోగాల్లోనూ తగిన న్యాయం జరిగేలా చట్టాలు రూపొందించాలి.
కాంగ్రెస్ సర్కారుకు బీసీల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలి. కానీ, అసెంబ్లీ లో చర్చించి కేంద్రానికి పంపామని, అక్కడి నుంచి అనుమతులు వస్తేనే 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం సరికాదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నది. కులగణనలో కేవలం ఓసీ జనాభా మాత్రమే పెరిగినట్టు చూపించి, ఎస్సీ, బీసీ కులాలు తగ్గినట్టు చూపించడం సరికాదు. సర్వే పూర్తిగా తప్పుల తడకగా జరిగింది.
రాష్ట్రంలో బీసీల జనాభా 51శాతం ఉందని గతంలో చేసిన అనేక సర్వేలు వెల్లడించాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం బీసీలు 46 శాతమే ఉండడం విడ్డూరంగా ఉంది. అంటే పదేళ్లలో బీసీల జనాభా కేవలం 2లక్షలేనా..? 10 శాతం ఉన్న ఓసీలు తాజా సర్వేలో ఏకంగా 15 శాతాన్ని చూపడం బూటకమే. జనాభా ప్రాతిపదికన కులాల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు, నిధులు కేటాయిస్తే నష్టపోయేది బీసీలు మాత్రమే. బీసీలను భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఎదగనీయకుండా అగ్రకులాలకు అనుకూలంగా నిర్వహించిన సర్వే. బీసీల మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం కుల గణన ప్రకటించడం హేయమైన చర్య. మరోసారి కుల గణన చేపట్టి బీసీ జనాభా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 42 శాతాన్ని కేటాయించాలి.
బీసీలను మభ్యపెట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కులగణన చేప్టటింది. ఆ సర్వే తప్పుల తడకగా ఉంది. దీంతో రాష్ట్రంలోని బీసీలకు ఒరిగేది ఏమీలేదు. బీసీల సంఖ్యను తగ్గించి చూపడం చూస్తే భవిష్యత్తులో బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కే కుట్ర జరుగుతున్నట్టు అర్థమవుతున్నది. దీనిపై గ్రామీణ స్థాయినుంచి మొదలు మండల, జిల్లా స్థాయి వరకు బీసీలను ఐక్యంచేసి భారీ ఎత్తున పోరాటం చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తం. తప్పుడు కులగణన కాకుండా నిజమైన బీసీ కులగణనను బయట పెట్టాలి.
రాష్ట్రంలో అన్ని కులాల కంటే బీసీ జనాభానే ఎకువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అది రేవంత్ ప్రభుత్వానికి కనిపించక పోవడం శోచనీయం. బీసీ వర్గాలను రాజకీయంగా అణగదొకేందుకు బీసీ జనాభాను తగ్గించి, మోసం చేసే కుట్రకు తీసిన్రు. అట్లనే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చిన్రు. ఈ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ లేదని స్పష్టమవుతున్నది. ఎకడైనా రోజురోజుకూ జనాభా శాతం పెరుగుతుంది. కానీ, తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలోనే కనిపిస్తున్నది. బీసీ జనాభా లెకలు ఎలా తగ్గాయో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెకలకు ఈ ప్రభుత్వం చేసిన లెకలకు తేడా ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి. చెప్పిన మాట ప్రకారం రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక ఎన్నికల్లో మేమేంటో చూపిస్తం.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ బీసీ కులాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నది. కులగణనను పకడ్బందీగా చేశామని, ప్రతి కుటుంబం వివరాలు సేకరించామని చెబుతున్న లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు. కొన్ని వర్గాలకు మేలు చేసేందుకు బీసీలకు అన్యాయం చేస్తున్నది. అణగదొక్కే కుట్ర చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చాతనైతలేదు. రిజర్వేషన్లలో బీసీలకు సమాన న్యాయం చేయకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతాం.
కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది. కావాలనే బీసీల జనాభా తగ్గించి, ఓసీల జనాభా పెంచి చూపించింది. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అగ్రవర్ణాల రిజర్వేషన్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది. కులగణన మళ్లీ చేయాలి. వాస్తవ లెక్కలు బయటపెట్టి ప్రభుత్వానికి బీసీలపై ఉన్న నిబద్ధతను నిరూపించుకోవాలి.
బీసీల లెక్కల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీసీల సంఖ్య 50శాతం దాటుతుందన్నది అంచనా ఉంది. సర్వే శాస్త్రీయంగా జరగలేదన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే పునఃసమీక్షించి బీసీల గణన తిరిగి చేపట్టాల్సిన అవసరం ఉంది.