కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొల్పిన ‘టీ హబ్’ తరచూ సుస్తికి గురవుతున్నది. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రం సేవల్లో జాప్యం జరుగుతున్నది. ఫలితంగా పేదలపై ప్రభావం పడుతున్నది. ఐదేళ్లకు డ్యూరేషన్‌పై తెచ్చిన ఎగ్జామిన్ మిషన్లు తరచూ సతాయిస్తూ ఉండడం, ఒక్కో మిషన్ సేవలు రోజుల తరబడి నిలిచి పోవడంతో ఇతర జిల్లాల టీ హబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించాల్సి దుస్థితి ఎదురవుతున్నది.
ఆరు నెలలకోసారి మిషన్లకు ఫ్రీ సర్వీసింగ్ ఇవ్వాల్సిన కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడం శాపంలా మారతున్నది. వ్యాధి నిర్ధారణ సకాలంలో జరగకపోవడంతో చికిత్స అందడంలో ఆలస్యమవుతున్నది. ఒక్కో విభాగంలో రెండేసి మిషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ పరిస్థితి మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ‘టీ హబ్’ పేరిట రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాలను ప్రారంభించింది. 2020లో ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానల్లో వీటిని ఏర్పాటు చేసింది. బయో కెమిస్ట్రీ, పాథలాజికల్, మైక్రో బయోలజీకి సంబంధించిన ప్రస్తుతం 57 రకాల పరీక్షలు నిర్వహించి నిరుపేదపై ఆర్థిక భారం పడకుండా చూసింది. అప్పట్లో నెలకు సగటున సుమారు 2 కోట్ల పరీక్షలు నిర్వహించి నిరుపేద రోగులకు సేవలు అందించారు.
బయోకెమిస్ట్రీ టెస్టుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ ఏర్పాటు చేశారు. అందులో కెమికల్ బయో కెమిస్ట్రీకి సంబంధించిన రక్త, మూత్ర పరీక్షల్లో ఏఎల్పీ, బీయూఎం, ఎల్డీఎల్, ఎఫ్బీఎస్, జీజీటీ, జీటీటీ, ఎల్‌హెచ్, ఎల్ఎప్టీ, లిపెర్ ఫ్రొఫైల్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్ (ర్యాండం బ్లడ్ షుగర్), ఆర్ఎఫ్టీ, సిరమ్ టోటల్, సిరమ్ కెంబిల్ రూబిన్ డైరెక్ట్, సిరమ్ హెడీఎల్, సిరమ్ కొలస్ట్రాల్, టోటల్ ప్రొటీన్, యూరిక్ క్యాసిడ్, ఎలక్ట్రో వైడ్స్, ఎస్జీఓటీ, ఎస్‌జీపీటీ వంటి అనేక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హార్మోన్లకు సంబంధించిన టీ-3, టీ-4, టీఎస్‌హెచ్ తదితర పరీక్షలు చేస్తున్నారు.
అన్ని రకాల హార్మోన్లు, థైరాయిడ్ పరీక్షలు ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఇక పాథలాజికల్ విభాగంలో రక్త కణాలకు సంబంధించిన ప్లేట్లెట్స్, తెల్ల, ఎర్ర రక్త కణాలను పరీక్షిస్తున్నారు. సీబీపీ, ఏఈసీ, కూంబ్స్ టెస్టు డైరెక్ట్, ఇన్ డైరెక్ట్, డీఎల్సీ, ఈఎస్ఆర్, పీసీవీ, టీఎల్సీ వంటి అన్ని రక్త కణాలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాథలాజికల్ విభాగంలోని అన్ని రకాల మూత్ర పరీక్షలు చేస్తున్నారు.
ఎలిసా రీడర్స్ మైక్రో బయోలజీ విభాగంలో సైన్ఫ్ల్యూ చికెన్ గున్యా పరీక్షలతోపాటు ఏఎస్ఓ, సీఆర్పీ, ఆర్ఎఫ్, ఆర్పీఆర్, టైడీ ఐజీఎం, ఐజీజీ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఈ పరీక్షల కోసం 2020 వరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ల్యాబ్‌పై ఆధారపడాల్సి వచ్చేది. టీ హబ్ పేరిట పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖానలు, ఏరియా దవాఖానలు, వెల్నెస్ సెంటర్లు, ఎంసీహెచ్‌లను అనుసంధానించారు.
ఆయా కేంద్రాల్లో ఓపీకి వచ్చే పేషెంట్లకు రక్త, మూత్ర నమూనాలు సేకరించి టీ హబ్‌లకు పంపిస్తే ఇక్కడ రోగుల వ్యాధిని బట్టి పరీక్షలు చేస్తారు. వీటిని ఆన్లైన్ చేయడం ద్వారా బయో కెమిస్ట్రీ, పాథలాజిస్టు, మైక్రో బయోలజిస్ట్ వైద్య నిపుణులు పరిశీలించి తిరిగి స్థానిక నిర్ధారణ కేంద్రాలకు నివేదిస్తారు. ఈ నివేదికలు సంబంధిత రోగుల మొబైల్ ఫోన్లకు అటాచ్ చేస్తారు. ప్రతి రోజూ రక్త, మూత్ర నమూనాలను సేకరించేందుకు ఆయా రూట్లలో ప్రభుత్వ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మొరాయిస్తున్న మిషన్లు
కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో మిషన్లపై అధిక భారం పడుతున్నది. జిల్లాలోని ఒక జనరల్ హాస్పిటల్, 1 ఎంసీహెచ్, 2 ఏరియా దవాఖానలు, 18 పీహెచ్‌సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, 1 వెల్నెస్ సెంటర్ ద్వారా రోజుకు వెయ్యి నుంచి 1,200 వరకు పరీక్షల నమూనాలు వస్తున్నాయి. ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహించే ఆరోగ్య మహిళ పరీక్షలు నిర్వహిస్తారు. వారంలో ఈ రెండు రోజులు 2 వేల నుంచి 2,500 వరకు పరీక్షల నమూనాలు వస్తున్నాయి.
టీహబ్‌లో ఉన్న మిషన్ల సామర్థ్యం మేరకు ఒక్క ఆరోగ్య మహిళలో వచ్చిన నమూనాలను పరీక్షించేందుకే వారంలో నాలుగు రోజులు పోతుంది. ఇక జనరల్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి చాలా టైం పడుతున్నది. మిషన్ల సామర్థ్యం మేరకు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఆరోగ్య మహిళ కింద రిపోర్టులు ఇవ్వడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతున్నది. జనరల్ రోగులకైతే 24 గంటలు మించుతున్నది. కొన్ని సార్లు అంతకంటే ఎక్కువ సమయం పోతున్నది.
ముఖ్యంగా అనేక పరీక్షలు నిర్వహించే ఆటోమేటెడ్ మిషన్‌పై తీవ్రమైన భారం పడుతున్నది. తరుచూ మొరాయిస్తున్నది. ఐదేళ్ల డ్యూరేషన్‌పై అమర్చిన ఈ యంత్రం రోజుకు నాలుగు గంటలు సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకుంటుంది. ఆ సమయంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించదు. 2023 నుంచి ఈ మిషన్ ఫ్రీ సర్వీసింగ్‌కు నోచుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక పార్ట్ చెడిపోయి రోజుల తరబడి పని చేయని పరిస్థితి ఉన్నది. సీబీపీ మిషన్‌పై కూడా అధిక భారం పడి తరచూ ఆగిపోతున్నది. ఇది ఆగిపోయినపుడల్లా జనరల్ హాస్పిటల్‌లోని మెడికల్ కళాశాల ల్యాబ్‌కు వెళ్లి టెక్నీషియన్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హార్మోన్లు, థైరాయిడ్, విటమిన్ డీ, విటమిన్ బీ12 ఫెరిటెన్ వంటి టెస్టులు చేసే ఇమ్యునో ఎనలైజర్ మిషన్‌పై ఎక్కువగా ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద సేకరించిన నమూనాలను పరీక్షిస్తారు. వారంలో నాలుగు రోజులు ఈ మిషన్‌పై ఎక్కువ భారం పడి సడెన్‌గా ఆగిపోతున్నది. పరీక్షలు నిర్వహించేందుకు రోజుల తరబడి ఆగాల్సి వస్తున్నది. ప్రధానమైన ఈ మూడు మిషన్లు తరచూ సతాయిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి టీహబ్లకు నమూనాలు తీసుకెళ్లి పరీక్షలు చేయించాల్సి వస్తున్నది.
అయితే అక్కడి హబ్‌లో అవకాశం ఉంటేనే ఇది వీలవుతున్నది. లేదంటే రోజుల తరబడి పరీక్షలు నిలిచి పోతున్నాయి. ఈ పరిణామాలు రోగుల చికిత్సలపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సకాలంలో రోగ నిర్ధారణ జరిగితేనే చికిత్స చేసేందుకు అవకాశముంటుంది. కానీ, రోగ నిర్ధారణలో జాప్యం కారణంగా కనీసం మందులు కూడా రాయలేని పరిస్థితి వైద్యులకు ఏర్పడింది. నిజానికి టీ హబ్‌లో మూడు సిఫ్ట్ల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. రోజుకు వెయ్యి నుంచి 1,200 నమూనాలను పరీక్షించాల్సి వస్తున్నది. అందులో కనీసం ప్రధానమైన మూడు నాలుగు మిషన్లు రెండేసి ఏర్పాటు చేస్తే రోగులకు సకాలంలో రోగ నిర్ధారణ జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
వైద్యులు ఎందుకు ఉండడం లేదు?
తెలంగాణ హబ్ 24/7 పని చేయాల్సి ఉంటుంది. తొమ్మిది మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ల్యాబ్ మేనేజర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్టుతోపాటు పాథలాజిస్ట్, మైక్రో బయాలజిస్ట్, బయోకెమిస్ట్రీకి చెందిన వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. ఒక అసిస్టెంట్ ఫ్రొఫెసర్, మరో అసోసియేట్ ఫ్రొఫెసర్ అందుబాటులో ఉండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీ హబ్‌లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ, ఎప్పుడో ఒకసారి తప్పా వీరంతా ఇటు వైపు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
బయో కెమిస్ట్రీ పోస్ట్ ఒకటి వెకెంట్ ఉండగా మిగతా వైద్యులెవరు టీ హబ్‌కు రావడం లేదని, వీరికి ఆన్లైన్లో రిపోర్టులు పంపిస్తే తప్పా చూడరని తెలుస్తున్నది. వీరిలో ఒక్కొక్కరికి లక్ష నుంచి లక్ష యాభైవేల వరకు జీతాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ, విధులకు మాత్రం హాజరు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు విధులకు హాజరై పర్యవేక్షిస్తే నిర్ధారణ పరీక్షల నిర్వహణ కొంత మెరుగయ్యేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు