కార్పొరేషన్, మే 30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న అబద్ధపు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడకుండా రికార్డు స్థాయిలో పంట పండించామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని పేర్కొన్నారు. పచ్చి అబద్ధాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇన్చార్జి మంత్రిగా కరీంనగర్ జిల్లాకు ఏమైనా ఇచ్చారా, కేవలం అబద్ధాలు మాట్లాడటం కోసం వచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 85 పిల్లర్లు ఉంటే రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక్కటై నీటిని పోలవరం దిక్కు వదులుతున్నారని ఆరోపించారు. 2022-2023లో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందని, దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టని పేర్కొన్నారు. మొన్న కరువు వచ్చేలా ఉందని మిడ్ మానేర్ నింపారని ఆ నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేసీఆర్‌ను బదనాం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉందని, జీలుగు విత్తనాలు రాలేదని, రైతుబంధు ఏమైందని ప్రశ్నించారు. వర్షాకాలం పంట సమయం వచ్చిందని, రైతుబంధు ఇస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. ఎరువులు, విత్తనాలు కొనే సమయం వచ్చిందని కాంగ్రెస్‌కు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మీద మరొక మారు అవాకులు చెవాకులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో హర్యానా, పంజాబ్‌కు దీటుగా తెలంగాణ ఉందని, దానికి కారణం కేసీఆర్ అని చెప్పారు. రైతు బీమా రెన్యువల్ చేయాలిని డిమాండ్ చేశారు.