బోయినపల్లి రూరల్, మే 24 : ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయినా ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై జీలుగ, జనుము, పెసర వంటి విత్తనాలు అందజేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రెండింతలు దోచుకుంటుందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, ఆరుగాలం పండించిన రైతుపై లేదని ధ్వజమెత్తారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ ఎంపీటీసీ ఐరెడ్డి గీత మల్లారెడ్డి, భీమనాథుని రమేశ్, జంగిడి సంజీవ్, కమల్‌గౌడ్, కట్ట గోవర్ధన్‌గౌడ్, ఎల్లారెడ్డి, కమల్, జీవన్‌రెడ్డి ఉన్నారు.
“ఓ వైపు వానలు దంచి కొడుతున్నా మా వడ్లు కొంటలేరు సారూ..” అంటూ మల్లాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద మహిళా రైతు శివవ్వ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో చెప్పుకొంటూ బోరున విలపించింది. “మా పెద్దాయన లేరు.. నా వడ్లు కొంటలేరు సారు” అంటూ చెప్పుకోగా, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు.