కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24 : కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పంటలకు, ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ కూడా పూర్తిగా అమలు చేయకుండానే ఏదో సాధించినట్టు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జీలుగ విత్తనాల ధరలు పెంచినందుకా..? లేక రుణమాఫీ చేస్తామని మోసం చేసినందుకా..? 600 మంది రైతులు చనిపోయినందుకా..? రైతులకు బేడీలు వేసినందుకా..? 500 బోనస్ ఎగ్గొట్టినందుకా..? ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల పక్షానా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూనే ఉంటామని, కేసులు, వేధింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
మంగళవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు కూడా రైతులను మోసం చేసేలా వ్యవహరిస్తుందని, ఎన్నికలు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. ఇప్పటికీ మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టి నాలుగోసారి కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ‘కేసీఆర్ ఏడాదికి మూడు పంటలకు ఎందుకు రైతుబంధు ఇవ్వవు?’ అన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎన్ని పంటలకు రైతు భరోసా ఇచ్చారో చెప్పాలన్నారు. రైతు భరోసా కింద సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి 15 వేలు ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండానే సంబురాలు చేసుకోవడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎకరానికి 19 వేల బాకీ ఉందన్నారు. ప్రతి విషయంలోనూ రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న బండి సంజయ్ బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. చేతనైతే రేవంత్‌రెడ్డితో కలిసి తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తే సంజయ్‌కి సన్మానం చేస్తామన్నారు. ఎంత సేపు కేసీఆర్‌ను విమర్శించడం తప్ప తెలంగాణ కోసం ఏ పని చేయలేని దద్దమ్మ అని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్‌పై విమర్శలు మాని ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.