కార్పొరేషన్, మార్చి 25 : మాజీ సీఎం కేసీఆర్‌పై ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆ పదవిని మరచి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. మంగళవారం స్థానిక 37వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందన్న బండి సంజయ్‌కు ఆ విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఆయన ఆ ప్రెస్‌లో ఏమైనా పని చేశారా అని ఎద్దేవా చేశారు.
దేశానికి మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ రాష్ట్రంలో తన పనులు చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలని సవాల్ చేశారు. గత రెండు రోజుల క్రితం కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి సునీల్‌రావుకు లేదన్నారు. ఆయన కాలి గోటికి కూడా సునీల్‌రావు సరిపోడని దుయ్యబట్టారు. సునీల్‌రావుకు మేయర్ హోదా ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని, అది కేటీఆర్ భిక్ష అని పేర్కొన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఆయన ఊసరవెల్లి లాంటి వాడని విమర్శించారు.
కాంగ్రెస్‌లో ఉండి బీఆర్ఎస్లో చేరి దొడ్డిదారిన పదవి పొంది కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్‌లో వెతికితే సునీల్‌రావు పేరు వస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకోబోమని, ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్మార్ట్‌సిటీలో బండి సంజయ్ పాత్ర లేదని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విమర్శించిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో మాత్రమే సాధ్యమైందని గుర్తు చేశారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ నాయకులను, బీజేపీలో చేరగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సునీల్‌రావుకు అలవాటుగా మారిందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్ అన్ని విధాలా అభివృద్ధి చెందిన విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, నాయకులు సాయికృష్ణ, మోహన్, నేతి చంద్రశేఖర్, ఆరె రవిగౌడ్, కొత్త అనిల్‌కుమార్, రాజేందర్, దుడెల్ల ప్రశాంత్, కర్రె అనిల్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, మెరుగు శ్రీనివాస్‌గౌడ్, నారదాసు వసంతరావు, ఉమా శంకర్, సతినేని శ్రీనివాస్, గంటల రేణుక తదితరులు పాల్గొన్నారు.