Sundaragiri | చిగురుమామిడి, ఏప్రిల్ 18: ఈనెల 27 నుండి మే 5 వరకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజకుమార్ తెలిపారు. సుందరగిరి ఆలయంలో కొబ్బరికాయల వేలంపాటను పురస్కరించుకొని హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో హుజురాబాద్ కు చెందిన మోటపోతుల రాకేష్ రూ.45,100 కు దక్కించుకున్నారని తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల చుట్టూ చలువ పందిళ్లతో పాటు భక్తులకు తాగునీరు తీర్థప్రసాదాలతో పాటు దాతల సహకారంతో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ, ఆలయ రికార్డ్ అసిస్టెంట్ బూట్ల కవిత, ఆలయ అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు, ఆలయ ధర్మకర్తలు గందె రాజయ్య, శేషం నరసింహ చార్యులు, జీల సంపత్, ఎలగందుల శారద, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.