Summer Cricket Coaching | కోల్ సిటీ, మే 12 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. గోదావరిఖని జీఎం కాలనీలోని స్టేడియంలో సింగరేణి ఆర్.జీ-1 జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ వేసవి కాలం సెలవులను పిల్లలు వృథా చేయకుండా క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. క్రీడల్లో శారీరక శ్రమ ద్వారా గుర్తింపుతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.
క్రికెట్ లో మెళకువలను నేర్చుకొని ఆటల్లో ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. శిక్షకులు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అవసరమైతే సింగరేణి తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కాగా 12 సం.ల నుంచి 23 సం.ల వయసు గల పిల్లలకు నెల రోజుల పాటు క్రికెట్ ఆటలో మెలకువలను నేర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు శిక్షణను పర్యవేక్షించారు. కాగా, క్యాంపుకు ఇన్ఛార్జిగా కిరణ్, కోచ్ గా సుదేశ్ వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో కేడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, ఆగమరావు, మురళీధర్, మహేందర్ గౌడ్, అజిత్, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.