కరీంనగర్ కార్పొరేషన్, జూలై 11: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) అతి త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 3500 మంది లబ్దిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేకపోయామని వెల్లడించారు. అతి త్వరలోనే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
నగరంలో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ గెస్ట్ హౌస్ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను రూ.80 లక్షలతో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 640 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామిన చెప్పారు. నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రారంభించిన సీఎం అస్యూరెన్స్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. దీనికి సంబంధించి పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి విన్నవించామని, అతి త్వరలోనే ఆ నిధులు మంజూరై అభివృద్ధి పనులు సాగుతాయన్నారు.