సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సర్కారు, ఉపాధి పునరావాసం పథకంలో భాగంగా వ్యాపారాలు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలు అందిస్తున్నది. 2022-23 సంవత్సరానికి గాను రూ.50 వేల నుంచి రూ.3 లక్షల విలువైన 18 యూనిట్లు జిల్లాకు మంజూరు చేయగా, అర్హులైన వారి నుంచి యంత్రాంగం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ నెల 28 వరకే ఆఖరు కాగా, సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నది.
– సిరిసిల్ల, ఫిబ్రవరి 26
సిరిసిల్ల, ఫిబ్రవరి 26 : స్వరాష్ట్రంలో దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు భరోసా ఇస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. నెల నెలా పింఛన్లు ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం ఉపకరణాలు, గిఫ్ట్ ఏ స్మైల్‌లో త్రిచక్రవాహనాలు అందిస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నది. అందులో భాగంగానే దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఆర్థిక పునరావాస పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు జీవనోపాధి కల్పించేందుకు వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు, వ్యా పార సంస్థలను నెలకొల్పేందుకు ప్రతి ఏటా సబ్సిడీపై రుణాలు అందిస్తున్నది. అనేక రకాల పథకాలతో అండగా నిలుస్తున్నది. ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నది. ఈ మేరకు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పునరావాస పథకం (2022-23)లో భాగంగా జిల్లాకు రూ.11.50 లక్షల విలువైన 18 యూనిట్లు మంజూరు చేయగా, అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు ఇలా..
జిల్లాలో వ్యాపారాలు నెలకొల్పాలనుకునే దివ్యాంగులు ఉపాధి పునరావాస పథకం ద్వారా ఆన్లైన్లో ఈ నెల 28 దాకా దరఖాస్తు చేసుకోవాలి. 21 ఏండ్ల నుంచి 55 ఏండ్లు వయసు కలిగి ఉన్న వారు అర్హులు. ఇందుకు 40శాతం అంగవైకల్యం తప్పనిసరి. సదరమ్ క్యాంపు ద్వారా జారీ చేసి వైకల్య ధ్రువీకరణ పత్రంతో పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి కులం, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలతోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, ఆధార్‌కార్డు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతం వారికి కుటుంబ ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ పరిధిలోని వారికి రూ.2లక్షల వార్షిక ఆదాయం ఉండాలి. అలాగే ఐదేళ్ల క్రితం ఇదే పథకం ద్వారా లబ్ధిదారుడై ఉండకూడదు. సం బంధిత విషయాల్లో సాంకేతిక అనుభవం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. సంబంధిత పత్రాలతో ఆన్లైన్ వెబ్సైట్ https//tsob mms. cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం (జి-33)తో సంప్రదించాలి.
ఎంపిక విధానం ఇలా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మంజూరైన యూనిట్ల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు మండలంలోని దివ్యాంగుల జనాభా ఆధారంగా యూనిట్లను కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
జిల్లాకు రూ.11.50 లక్షల రుణాలు
దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా 18యూనిట్లును మంజూరు చేశారు. వీటిలో 15 మంది దివ్యాంగులకు రూ.50 వేల యూనిట్లు, ఒకరికి రూ.లక్ష, రెండు లక్షలకు చెందిన ఒక యూనిట్, మూడు లక్షలకు చెందిన ఒక యూనిట్‌ను కలిపి మొత్తం 18 యూనిట్లు మంజూరు చేశారు. కాగా, రూ.50 వేల యూనిట్‌కు సంబంధించి (వంద శాతం) పూర్తి సబ్సిడీపై ఇవ్వనున్నారు. లక్ష యూనిట్‌కు సంబంధించి 80 శాతం, రెండు లక్షల యూనిట్‌కు 70 శాతం, మూడు లక్షల యూనిట్‌కు 60 శాతం సబ్సిడీపై ఇస్తారు.
ఆర్థిక పరిపుష్టికి అవకాశం..
దివ్యాంగులకు ఆర్థికంగా పరిపుష్టి కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక పునరావాస పథకం కింద రుణాలు అందిస్తున్నది. జిల్లాకు 18యూనిట్లు మంజూరయ్యాయి. ఈ నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు 50 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆర్థికంగా రాణించాలనుకునే దివ్యాంగులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమాధికారి, రాజన్న సిరిసిల్లజిల్లా