Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఓ వైపు భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. బ్యాంకింగ్ (Banking), ఫైనాన్షియల్ (Financial), ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు, హార్ముజ్ జలసంధి (Strait of Harmuz) దాటేందుకు భారత నౌకలకు అడ్డంకులు తొలగిపోవడం లాంటి కారణాలవల్ల సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి.
ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ కనిష్ఠాల నుంచి 1,550 పాయింట్ల మేర పుంజుకుంది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్ఠాల నుంచి 2 శాతం మేర ఎగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, రిలయన్స్, ఎస్బీఐ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. వరుస నష్టాల వేళ ఆయా స్టాక్స్ కనిష్ఠాలకు చేరడంతో ఇదే అదునుగా మదుపర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.
సెన్సెక్స్ ఉదయం 74,415.79 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో లాభనష్టాల మధ్య కదలాడిన సూచీ.. ఆఖరి గంటలో భారీగా లాభపడింది. ఇంట్రాడేలో 75,805.27 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 938.93 పాయింట్ల లాభంతో 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.42గా ఉంది.
ఇక సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్ స్టాక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. బీఈఎల్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 104 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. బంగారం ఔన్సు 4,980 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.