BRS | సిరిసిల్ల టౌన్, మే 30: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాఠశాలలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో గురుకులలో శానిటేషన్ నిర్వహణకు ప్రతి నెల ఒక్కో పాఠశాలకు రూ.40 వేలు కేటాయించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పద్దతిని తొలగించడంతో పిల్లలతోనే శానిటేషన్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్లను తొలగించి సదరు పనులన్నింటినీ విద్యార్థులతో చేయిస్తున్నారని, ఇది చట్టరిత్యా నేరం అని పేర్కొన్నారు. ఐఎఎస్ అధికారిని వర్షిణి గారు మాట్లాడిన మాటల్లోనూ విద్యార్థులకు వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.
సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఏమైనా పాష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని విమర్శించారు. పిల్లలతో శానిటేషన్ పనులు చేయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో మొత్తం 1200ల మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యమసరమైన చోట ఉద్యోగులను తొలగిస్తూ విద్యార్థులపై పనిభారం మోపుతుందన్నారు.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురుకుల పాఠశాలలను వివిక్ష కేంద్రాలుగా మార్చుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐఏఎస్ వర్షిణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే గురుకులాలలో మెయింటనెన్సుకు డబ్బులు అందించాలన్నారు. పిల్లలతో పనులు చేయించడం మానుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, ఎస్కే అఫ్రోజ్, కాసర్ల శ్రీనివాస్, మాగంటి కిరణ్, అర్జున్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.