Collector Koya Sriharsha | పెద్దపల్లి, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యానభ్యసిస్తున్న విద్యార్థులందరికీ చదవటం, రాయటం రావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం విద్యాశాఖ అధికారులతో ఎఫ్ఎల్ఎన్ అమలుపై కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంపై పూర్తి పట్టు ఉండాలని, మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి ధారాళంగా చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక గణిత సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా టీఎల్ఎం తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో శారద, అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం. షేక్ ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక పశు వైద్య శిబిరాలు
ఈనెల 1 నుంచి 7 వరకు జిల్లాలోని 54 గ్రామాలు జరిగే ప్రత్యేక పశు వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. జాతీయ సేవా పథకంలో భాగంగా నిపుణులైన పశు వైద్యులచే ఎంపిక చేసిన 54 గ్రామాలలో ప్రత్యేక పశువైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.