కోరుట్ల రూరల్/ ఇబ్రహీంపట్నం/ మల్యాల, డిసెంబర్ 28 : “మా టీచర్లే మాకు కావాలి.. డిప్యూటేషన్ టీచర్లు వద్దు’ అంటూ కసూర్బాగాంధీ పాఠశాలల విద్యార్థులు శనివారం నిరసనలు చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా అందులో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులకు విద్యాబోధన సరిగా జరగడం లేదు. ఈ మేరకు విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను కేటాయిస్తుండడంతో విద్యార్థులు తిరస్కరిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలోని కల్లూరు, ఇబ్రహీంపట్నం, మల్యాల మండల కేంద్రాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కోరుట్ల మండలం కల్లూరు కేజీబీవీకి విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు కోరుట్ల ఎంఈవో గంగుల నరేశం 10 మంది మహిళా ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపారు. పాఠశాలకు వెళ్లిన వారిని విద్యార్థులు అడ్డుకొని ప్రధాన ద్వారాన్ని మూసివేసి నిరసన తెలిపారు. కొందరు విద్యార్థులు తమకు తమ ఉపాధ్యాయులే కావాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థులు నిరసనకు దిగడంతో డిప్యూటేషన్‌పై వచ్చిన వారు ఎంఈవోకు సమాచారం అందించారు. దీంతో ఏంఈవో పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో పాఠశాల వద్ద గందరగోళం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యార్థులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. మల్యాల మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో జయసింహారావు పాఠశాల ఆవరణ చేరుకుని విద్యార్థులను సముదాయించారు.