Narasimhulapally | ధర్మారం, నవంబర్ 26 : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు పెద్దపల్లి జిల్లా నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 30న ఆన్ లైన్ లో 13 గంటల పాటు నిర్విఘ్నంగా నిర్వహించే బాల సాహిత్యభేరి కార్యక్రమంలో కథ, వచన కవిత, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.
ఈ పోటీలలో భాగంగా ఈ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న గంగారపు శృతి, దారవేణి అశ్విత, అలిశెట్టి రాహుల్,9వ తరగతి చదువుతున్న సింగం శశాంత్, 8వ తరగతి చదువుతున్న గన్ముకుల లవన్ కుమార్ లు కథ, వచన కవిత విభాగంలో తమ కథలను, కవితలను జూమ్ వేదికగా వినిపించనున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులకు పాల్గొనే అరుదైన అవకాశాన్ని కల్పించిన తానా నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజ్మీర రమేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం తో పాటు సహా ఉపాధ్యాయులు నరేందర్, ఆంజనేయులు, పుష్పలత, శ్రీనివాస చక్రవర్తి, రామ చంద్రారెడ్డి, కందుకూరి భాస్కర్ అభినందించారు.