Chigurumamid | చిగురుమామిడి, ఏప్రిల్ 24 : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చిగురుమామిడి తహసీల్దార్ రమేష్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తహసీల్దారు రమేష్, కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ, పూర్వ ఇన్చార్జి ప్రిన్సిపల్ అధ్యాపకులు సంపత్ కుమార్ కళాశాలలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన సురుగూరి కీర్తనకు రూ.5వేల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులు ఈ కళాశాలలోనే 470 కి గాను 465 రావడం కళాశాలకే గర్వకారణం అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఎక్కువ ఫలితాలు సాధించాలని సూచించారు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రైవేటు కళాశాలకు వెళ్లకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఉచిత విద్య, భోజనం సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జయప్రద, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.