Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 5: చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు తనిఖీ చేశారు. కాగా వారి బ్యాగుల్లో మద్యం సీసాలు కనిపించాయి.
వెంటనే ప్రధానోపాధ్యాయులు జయప్రద స్థానిక సర్పంచ్ సమాచారమిచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న తిమ్మాపూర్ ఎక్సైజ్ సీఐ బాబా గ్రామంలో బెల్టు షాపులు తనిఖీ చేశారు. కాగా లక్ష్మయ్య, కనకయ్య కు చెందిన బెల్ట్ షాపుల్లో 14 మద్యం సీసాలు లభించాయి. విద్యార్థులకు మద్యం సీసాలు అమ్మడం పట్ల నిర్వాహకులపై సీఐ అగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ విద్యార్థులను పరోక్షంగా మద్యం వైపు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో బెల్ట్ షాపులు నడిపినట్లయితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.