పెద్దపల్లి, జూలై 27 : రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రణానికి దిగింది. సాగునీటి కోసం పెద్దపల్లిలో రోడ్డెక్కింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. గంటకుపైగా అక్కడే బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని, అప్రకటిత కరెంటు కోతలు అరికట్టాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, మక్కల బార్దాన్లకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన’ అంటూ నినదించారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని విరుచుకుపడ్డారు. నీళ్లు పంట పొలాలు బీడుగా మారుతున్నాయని, రైతు లు ఆందోళన చెందుతున్నా రేవంత్‌రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కక్షతో కావాలని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని భావించి గోదావరి నీళ్లను వదలి వేస్తున్నదని, రాష్ట్ర రైతులను దగా చేస్తూ గురువు కోసం శిష్యు డు చేస్తున్న గొప్ప త్యాగమని దుయ్యబట్టారు. అప్రకటిత కరెంట్ కోతలు, నాణ్యమైన సరఫరా లేక మోట ర్లు, స్టాటర్లు కాలిపోయి రైతులు నష్టపోతున్నారని వాపోయారు. యూరియా యాప్‌తో రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని, అంతేకాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలడంతో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులు నారు పోసుకొని ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదని, వర్షాలు పడకుంటే పంట పొలాలు బీళ్లుగా మారుతాయని కన్నీరు పెట్టుకుంటున్నా సర్కారులో చలనం లేదని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రైతులకు పొలాలకు నీరందించేలా చూడాలని విజ్ఞప్తి చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనేటి సంపత్ యాదవ్, తిరుపతిరెడ్డి, మార్కు లక్ష్మణ్, కొయ్యడ సతీ శ్, పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, లైశెట్టి బిక్షపతి, మెన్నం రవీందర్, కాశిపాక వాసు, గండు రంగయ్య, సందీప్ రావు, ముత్యాల రాజయ్య, లక్ష్మణ్, కుమార్, రమేశ్, చంద్రశేఖర్, స్వామి, ఫహీం పాల్గొన్నారు.