సుబేదారి, జూలై 27 : వైద్యారోగ్య శాఖ అస్తవ్యస్తంగా మారడంతో పల్లె ప్రజలకు అరకొరగా వైద్యం అందుతోంది. హనుమకొండ జిల్లాలో ఉద్యోగుల డిప్యుటేషన్లు.. సిబ్బంది కొరత, 30 మందికిపైగా ఉద్యోగులు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో పాగా వేయడంతో వైద్య సేవలు మృగ్యమయ్యాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఒకవైపు సీజనల్ వ్యాధులు మొదలుకాగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు పైరవీ, పలుకుబడితో వరంగల్ నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు డిప్యుటేషన్ల పేరుతో లాంగ్స్టాండ్గా పనిచేస్తున్నారు. దీంతో పల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా స్టాఫ్ లేకపోవడంతో స్థానికంగా సర్కారు వైద్యం అందడం లేదు. జిల్లాలో 14 మండలాల్లోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
వీటిలో ధర్మసాగర్, ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మెడికల్ ఆఫీసర్లు డిప్యుటేషన్ పద్ధతిలో పనిచేస్తు న్నారు. స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ అసిస్టెంట్లు ఖాళీలు ఉన్నాయి. అదే తీరుగా 63 దవాఖానలు, 106 ఉప కేంద్రాలకు రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం, వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ల డ్యూటీ విషయంలో సమయపాలన పాటించడం లేదు. అదేవిధంగా పీహెచ్‌సీల్లో పనిచేస్తు న్న స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు పైరవీ, పలుకుబడి, ఆరోగ్య సమస్యల సాకుతో 30మందికి పైగా వరంగల్ నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పాగా వేయడతో పల్లె ప్రజలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగా మారింది.
వైద్యారోగ్య శాఖలో అమలవుతున్న కార్యక్రమాల్లో చాలా వరకు జాతీయ ఆరోగ్య మిషన్‌కు సంబంధించినవే. ప్రోగ్రామ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో జనీన సురక్ష యోజన, శిశు సురక్ష, గర్భిణులు, నవజాత శిశువులకు ఉచిత సేవలు, రవాణా, నగదు స హాయం, మలేరియా, క్షయ, డెంగ్యూ, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు సంబంధించిన వై ద్య సేవలు ముందుకు సాగడం లేదు. జిల్లా వైద్యాధికారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పటికీ వైద్యాధికారు లు, సిబ్బంది డ్యూటీలకు డుమ్మాకొట్టడం, వచ్చినా అ టెండెన్స్ వేసుకొని ఇంటి దారు పడుతున్నారు. పీహెచ్‌సీల్లో రక్తపరీక్షలు చేయడం లేదు, బీపీ చెక్ చేసి, గోలీ లు ఇచ్చి పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
సర్కారు దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం, కొన్ని చోట్ల మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీలు ఉండడం, సిబ్బంది సరిపడా లేనందున రోగులు వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు సీజన్ వ్యాధులు మొదలుకావడంతో తప్పనిసరై అక్కడికి వెళ్లి రూ. వేలు చెల్లించి వైద్యం పొందుతున్నారు.