త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లయింది. దాంతో అభిమానుల చూపంతా ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం 47’ పైనే ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ కథానాయకుడు కావడం సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. రచయితగా త్రివిక్రమ్..వెంకటేష్‌కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి హిట్స్‌ను అందించారు. దాంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్, శ్రీనిధిశెట్టి, నారా రోహిత్ నవ్వుల్ని పండించారు. కుటుంబ అనుబంధాలు, హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతున్నది. వెంకటేష్ తనదైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో హైలైట్‌గా నిలిచారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.