ఏటూరునాగారం, జూలై 27 : తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, అటవీశాఖ అధికారుల దాడులు నిలిపివేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏను ముట్టడించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల నుంచి సుమారు 2వేల మంది గొత్తికోయలు పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు బండారు రవి కుమార్, సూడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిడియం బాపురావు మాట్లాడారు.
దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై ఆదివాసీలకు చట్టబద్ధమైన హక్కులు కలిగి ఉన్నప్పటికీ ప్ర భుత్వం సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందన్నారు. రెండు నెలల్లో సమస్యను పరిష్కరించకుంటే అక్టోబర్లో అన్ని జిల్లాల నుంచి సమీకరణ చేస్తూ ఏటూరునాగారం నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని, భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఐటీడీఏ వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఆదివాసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి వచ్చిన గొత్తికోయలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ట్రాక్టర్ యాజమానులకు అటవీ అధికారులు దుక్కి చేయద్దని నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్ఐఆర్లో గొత్తికోయల పేర్లను తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బీ సాంబశివ, దావూద్, రత్నం రాజేందర్, గ్యానం వాసు, చిట్టిబాబు, రఘు పతి, గొంది రాజేశ్, చిరంజీవి, దామోదర్, శ్రీను, కృష్ణబాబు, చారి, నగేశ్, కిష్టయ్య, ప్రవీణ్, నరేశ్ పాల్గొన్నారు.