గురుకులాలపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాలయాలను గాలికొదిలేసింది. గాడి తప్పిన నిర్వహణతో వసతుల్లేక విద్య అందని ద్రాక్షగా మారుతుండగా, పిల్లల భోజన తయారీకి సంబంధించి బిల్లులనూ నాలుగు నెలలుగా పెండింగ్‌లోనే పెట్టడంతో భోజన తయారీ కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. గతేడాది నుంచి నూతన మెనూను అమలు చేస్తున్నా, ఆహార తయారీ వ్యయాన్ని పెంచకపోవడంతో గిట్టుబాటుకాక నరకం చూస్తున్నారు. ఏప్రిల్‌లోనే అగ్రిమెంట్ గడువు ముగిసినా ఒప్పందంలో ఉన్న చిన్న అంశాన్ని ఆసరాగా చేసుకొని మళ్లీ అగ్రిమెంట్ జరిగేదాకా వంట చేయాలని ఒత్తిడి చేస్తే ఇన్నాళ్లూ భరించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘వంట చేయలేం.. భోజనం పెట్టలేమంటూ’ చెప్పడమే కాదు, నేడో రేపో బంద్ చేస్తామని తాజాగా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
జగిత్యాల, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించి గొప్పగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల ఆధీనంలో ఉన్న ఈ గురుకులాల్లో విద్యార్థులకు భోజన తయారీకి రెండు వేర్వేరు పద్ధతులు అమలు చేస్తున్నారు. కస్తూర్బాతోపాటు మైనార్టీ గురుకులాల్లో ప్రభుత్వమే భోజన తయారీ దారులను శాలరీ బేస్‌పైన నియమించగా, పిల్లలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వంట మనుషులు తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇక ప్రభుత్వ గురుకులాలు, మహాత్మా జ్యోతిబాఫూలే, ఎస్సీ వెల్ఫేర్ గురుకులాల్లో భోజన తయారీని టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టు కింద అప్పగిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇదే పద్ధతి అమలవుతున్నది. 2020 విద్యా సంవత్సరంలో గురుకులాల్లో వంట చేసే వారి కోసం టెండర్లను నిర్వహించింది. నిర్దేశిత మెనూ ప్రకారం విద్యార్థికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తయారీ చేయాలని, అలాగే వంట తయారీకి సంబంధించిన వంట చెరుకు/సిలిండర్లను గుత్తేదారులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఒక్కో విద్యార్థికి గరిష్ఠంగా 9 చెల్లిస్తామని పేర్కొంటూ టెండర్ జారీ చేసింది. టెండర్ పొందిన వారు ఎస్సీ వెల్ఫేర్ గురుకులానికి సంబంధించి అయితే 35వేల డిపాజిట్, మిగిలిన వాటికి 75వేలు విద్యా సంవత్సరానికి ధరవాత్తు సొమ్ముగా పెట్టాలని నిర్దేశించింది. ఈ టెండర్‌ను పరిశీలించిన చాలా మంది వంట తయారీదారులు 7.90 పైసల నుంచి 8 వరకు కోట్ చేసి టెండర్లు పొందారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నీ రోజులు భోజన తయారీ దారులకు బిల్లుల చెల్లింపుల్లో గుత్తేదారులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. భోజన తయారీలోను ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 విద్యా సంవత్సరాన్ని అదే టెండర్‌తో కొనసాగించింది. ఆపైన 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేసింది. అయితే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు అధికం కావడంతో గతేడాది నవంబర్‌లో గురుకులాల్లో కామన్ మెనూ ఇచ్చింది. ఉదయం అల్పాహారం, బ్రేక్‌లో సీజనల్ ఫ్రూట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్‌కు మెనూను ప్రకటించింది. ఉదయం అల్పాహారంలో కిచిడి, టమాట చట్నీ, ఇడ్లీ, సాంబార్, పల్లి చట్నీ, టమాట చట్నీ, బోండా, వడ, ఉప్మా, పొంగలి, పూరి కూర్మా, జీరారైస్, చపాతి, ఆలు కుర్మాలను తయారు చేసి పెట్టాలని నిర్దేశించింది. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనంలోకి బగార రైస్, అన్నం, నెలకు రెండు సార్లు మటన్, రెండుసార్లు చికెన్, నాలుగు రోజులు కోడిగుడ్లు, చిక్కుడు, గోరు చిక్కుడు, బీర, సోర, దొండ కాయ కూరలు తయారీ చేసి పెట్టాలని ఆదేశించారు. ఇక సాయంత్రం స్నాక్స్‌లోకి ఉడికించిన పల్లీలు, బబ్బెర్లు, బటానీలు, శనిగలు, ఎగ్బుజ్జి, ఉల్లిపాయ పకోడి ఇవ్వాలని నిర్దేశించారు. అయితే ఇంత చేసిన సర్కార్ వంట తయారీ కాంట్రాక్టర్లకు మాత్రం టెండర్ రేట్‌ను పెంచలేదు. ఐదేండ్ల క్రితం వేసిన రేట్లకే కాంట్రాక్టర్లు అల్పాహరం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్ తయారు చేసి ఇవ్వాల్సి వస్తున్నది.
ప్రభుత్వ చర్యతో వంట తయారీ టెండర్‌దారులు నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. గతంలో రెండు భోజనాలు, ఒక అల్పాహారం చేసే వాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. అలాగే గతంలో 9 గంటలకు అల్పాహారం తయారు చేసి వడ్డించేవారమని, ఇప్పుడు ఉదయం 7 గంటలకు అల్పాహరం తయారు చేసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. ఐదారు వందల మంది పిల్లలకు ఇడ్లీలు, వడలు, బోండాలు, చట్ని తయారు చేయాలంటే తెల్లవారుజామున 3 గంటలకు వంట చేయడం ఆరంభించాల్సి వస్తుందని, దీంతో వంటతయారీ చేసే మనుషులు గతం కంటే ఎక్కువ కూలీ తీసుకుంటున్నారంటున్నారు. అలాగే గతంలో వండే భోజనం క్వాంటిటి మీది నుంచి పరిశీలిస్తే ఇప్పుడు రెట్టింపు క్వాటింటీ తయారు చేయాల్సి వస్తున్నదని, దీంతో సిలిండర్లు అదనంగా వినియోగించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గతంలో ఒక నెలకు వినియోగించే సిలిండర్ల సంఖ్య కంటే ఇప్పుడు నెలకు పది నుంచి పదిహేను సిలిండర్లు అదనంగా వాడాల్సి వస్తున్నదని, సిలిండర్ల ధర సైతం అధికంగా పెరిగిపోయిందని, దీంతో తీవ్రభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజన తయారీ వల్ల నాలుగు డబ్బులు మిగలడం కాదు కదా, నెలకు 25వేల నుంచి 30వేలు అదనంగా జేబుల నుంచి చెల్లించాల్సి వస్తోందంటున్నారు.
కొత్త మెనూ ప్రకారం భోజనం తయారీకి సంబంధించి కొత్త టెండర్లు నిర్వహించాలి. ఆగస్టులో టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ సరిగా లేదు. గతంలో 35వేలు, 75 వేలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు టెండర్లో ఒక విద్యా సంవత్సరంలో ఒక గురుకులం విద్యార్థులకు భోజనం తయారీకి ఎంత వ్యయమవుతుందో.. అందులో ఐదో వంతు డిపాజిట్ చేయాలన్న నిబంధన సరికాదు. ఇలా చేయడం వల్ల ఒకొక్క కాంట్రాక్టర్ 5లక్షల నుంచి 9లక్షల వరకు డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది. అంత పెద్ద మొత్తం ఎలా సాధ్యమవుతుంది? టెండర్ ఫైనల్ రేట్ కేవలం 10.10 నిర్ధారించారు. దీన్ని సరిచేయాలి. పెరిగిన సిలిండర్లు, కూలీ రేట్లు, మెన్‌ను చూసి రేట్లు పెంచాలని కోరుతున్నాం. అలాగైతేనే పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టగలం. లేకుంటే పెట్టలేం.
– దాసరి మహేశ్, భోజన తయారీ కాంట్రాక్టుదారుడు
నాలుగు నెలలుగా భోజనం చేసి పెడుతున్నాం. అయినా మాకు ఇంత వరకు పేమెంట్ చేయలేదు. నిజం చెప్పాలంటే మా అగ్రిమెంట్ గడువు ఏప్రిల్ 23తోనే ముగిసింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అగ్రిమెంట్ కాకపోతే పిల్లలు అవస్థలు పడుతారని గత ప్రభుత్వం టెండర్ నోటీసులో అగ్రిమెంట్ అయ్యే వరకు వంట చేయాలన్న చిన్న నిబంధనను పెట్టింది. దాన్ని బేస్ చేసుకొని మమల్ని చాలా ఇబ్బందిపెట్టారు. నాలుగు నెలల బిల్లులు వెంటనే చెల్లించాలి. అలాగే అగ్రిమెంట్ పద్ధతిలో మార్పు తేవాలి.
– మర్రిపెల్లి శ్రీరాములు, భోజన తయారీదారుడు
2025-26 విద్యా సంవత్సరానికి టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదు. గత విద్యా సంవత్సరంలో అగ్రిమెంట్లో ఉన్న ఒక చిన్న క్లాజ్ ఆధారంగా గత టెండర్ దారులతోనే జూన్ నెల నుంచి భోజనం తయారీ చేయిస్తున్నారు. పని పెరిగిందని, పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని, తాము వంట చేయలేమని కాంట్రాక్టర్లు మొత్తుకున్నా, వినకుండా ఒత్తిడి పెట్టి నాలుగు నెలలుగా భోజనం తయారు చేయించారు. అయితే ఈ నాలుగు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు మాత్రం సర్కార్ ఇవ్వలేదు. పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్న పట్టించుకున్నపాపాన పోలేదు. దీంతో విసిగిపోయిన భోజన తయారీదారులు, వంటను నిలిపివేస్తామంటూ కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.