Seasonal diseases | పెద్దపల్లి, జూన్3:జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, నీటిపారుదల, మిషన్ భగీరథ అంశాలపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి నియంత్రించేందుకు వానాకాలం ముగిసే వరకు గ్రామాలలో రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహించాలన్నారు.
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల్లోని పిచ్చి మొక్కలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. వర్షకాలంలో నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు, కుంటలలో ప్రస్తుత నీటి నిల్వలు, వరదను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, చెరువు కట్టల పటిష్టతను పరీక్షించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన పరిస్థితులలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధంగా ఉండాలని, పునరవాస కేంద్రాలను సిద్ధం చేయలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా సజావుగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైపు లీకేజీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, పీఆర్ ఈఈ గిరీష్ బాబు, పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.